టీమిండియా గర్జన.. ఆసియా కప్ మళ్లీ మనదే!
Hockey Asia cup 2025: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో దక్షిణ కొరియాను 4-1 తేడాతో ఓడించి భారత టైటిల్ కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో భారత హాకీ జట్టు వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్ పోరుకు కూడా అర్హత సాధించింది. టీమిండియ నాలుగో సారి ఆసియా కప్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఇరు జట్లు అజేయంగా ఫైనల్‌కు చేరుకున్నాయి. కానీ ఫైనల్ మ్యాచ్‌లో యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ముందు 5 సార్లు ఆసియా ఛాంపియన్ అయిన దక్షిణ కొరియా ఓటమిపాలైంది.
మొదటి నిమిషంలోనే గోల్ చేసిన సుఖ్‌జీత్ సింగ్
హర్మన్‌ప్రీత్ సింగ్ మొదటి నిమిషంలోనే సుఖ్‌జీత్‌కు ఒక పాస్ ఇచ్చాడు. దక్షిణ కొరియా జట్టు తమ డిఫెన్స్‌ను సర్దుకునేలోపే భారత్ గోల్ సాధించింది. ఆ తర్వాత 7వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ ముందు దక్షిణ కొరియా ఆటగాడు ప్రమాదకరంగా హాకీ స్టిక్‌ని తిప్పడంతో భారత్‌కు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. అయితే జుగ్‌రాజ్ సింగ్ గోల్ చేయడంలో విఫలమయ్యాడు. భారత్ ఆధిక్యం 1-0 గానే ఉంది.

కొనసాగిన భారత ఆధిక్యం
మొదటి క్వార్టర్ వరకు భారత జట్టు దూకుడుగా ఆడింది. మరోవైపు దక్షిణ కొరియా జట్టు డిఫెన్స్‌కు పరిమితమైంది. మొదటి క్వార్టర్ తర్వాత భారత జట్టు 1-0 ఆధిక్యంతో ఉంది. రెండో క్వార్టర్‌లో కూడా టీమిండియా పటిష్టంగా ప్రారంభించింది. ఈ క్వార్టర్‌లో కూడా కొరియా డిఫెన్స్‌కు పరిమితం కాగా, హర్మన్‌ప్రీత్ సింగ్ జట్టు నిరంతరం దూకుడుగా ఆడింది. రెండో క్వార్టర్ ముగిసేలోపు దిల్ప్రీత్ సింగ్ మరో గోల్ చేసి భారత్‌ను 2-0తో ముందుకు తీసుకెళ్లాడు. హాఫ్‌టైమ్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంతో విరామానికి వెళ్లింది.
ఆట చివరి క్వార్టర్ లో కూడా భారత్ గోల్స్
మూడో క్వార్టర్ లో కూడా భారత ఆటగాళ్లు ప్రారంభంలో కొరియా గోల్‌పోస్ట్‌పై దాడి చేశారు. 32వ నిమిషంలో టీమిండియా పెనాల్టీ కోసం అప్పీల్ చేసింది, కానీ వీడియో రిఫరల్‌లో అది తిరస్కరించబడింది. 38వ నిమిషంలో మరో అవకాశం లభించింది, కానీ ఈసారి కొరియా డిఫెన్స్ అప్రమత్తంగా ఉండి రిబౌండ్ ప్రయత్నాలను కూడా అడ్డుకుంది. భారత జట్టుకు వ్యతిరేకంగా మ్యాచ్‌లో మొదటి పెనాల్టీ కార్నర్ దక్షిణ కొరియాకు లభించింది, 39వ నిమిషంలో భారత ఆటగాడి తప్పు వల్ల ఇది జరిగింది. కానీ కొరియా దీనిని ఉపయోగించుకోలేకపోయింది.
42వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించింది. ఈసారి హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా గోల్ చేయలేకపోయాడు. అయితే 30 సెకన్లలోనే భారత్‌కు చెందిన దిల్ప్రీత్ గోల్ చేసి జట్టును 3-0తో ముందుకు తీసుకెళ్లాడు. నాలుగో క్వార్టర్‌లో కూడా భారత జట్టు గోల్ చేసింది. అమిత్ రోహిదాస్ 50వ నిమిషంలో స్కోర్‌బోర్డులో తన పేరు నమోదు చేసుకున్నాడు. సౌత్ కొరియాకు మొదటి గోల్ 51వ నిమిషంలో లభించిన కార్నర్ ద్వారా వచ్చింది. సన్ డయాన్ బంతిని రిఫ్లెక్ట్ చేసి టీమిండియా డిఫెన్స్‌ను ఛేదించాడు. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. మ్యాచ్ 4-1తో భారత్‌కు అనుకూలంగా ముగిసింది.
ఆసియా కప్ విజేతలు
మొదటి 4 ఆసియా కప్‌ల ఫైనల్స్‌కు చేరిన భారత జట్టు మొదటి టైటిల్‌ను 2003లో గెలుచుకుంది. అంతకుముందు మొదటి 3 ఆసియా కప్‌ల ఫైనల్స్‌లో టీమిండియా పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది, అలాగే 1994లో దక్షిణ కొరియా చేతిలో ఓడిపోయింది. కొరియా 1999లో కూడా టైటిల్ గెలిచి పాకిస్తాన్‌ను ఓడించింది. 2003, 2007లో భారత్ వరుసగా 2 టైటిల్స్ గెలుచుకుంది. 2009, 2013లో కొరియా కూడా ఛాంపియన్‌గా నిలిచింది. 2017లో టీమిండియా గెలుచుకుంది. 2022లో సౌత్ కొరియా టైటిల్ సాధించింది. 2025లో టీమ్ ఇండియా నాలుగోసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది.












Click it and Unblock the Notifications