ఎవడు ఉంటాడో.. ఎవడు పోతాడో గానీ: డెడ్ లైన్ దగ్గరికొచ్చింది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మినీ ఆక్షన్ కు గడువు సమీపించింది. డిసెంబర్ 13 నుండి 15 మధ్య జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికి నెల రోజులు ముందే అంటే.. నవంబర్ 15 నాటికి ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను బీసీసీఐకి అందజేయాల్సి ఉంటుందని క్రీజ్‌బజ్ వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వేలం తేదీలు, వేదిక ఖరారుపై ఫ్రాంఛైజీలతో బీసీసీఐ సంప్రదింపులు నిర్వహిస్తోందని పేర్కొంది.
గత రెండు సీజన్లకు సంబంధించిన ఐపీఎల్ ఆక్షన్లు కూడా విదేశాల్లో జరిగిన విషయం తెలిసిందే. దుబాయ్, జెడ్డాలో ఇవి ఏర్పాటయ్యాయి. ఈసారి దీనికి భిన్నంగా భారత్ లోనే వేలం నిర్వహించే అవకాశం ఉంది. బీసీసీఐ అధికారులతో సంప్రదింపులు జరిపిన ఫ్రాంచైజీ ప్రతినిధులు డిసెంబర్ మధ్యలో వేలం నిర్వహించడంపై చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ వేలం ఇండియాలో జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

నవంబర్ 15వ తేదీన రిటెన్షన్ గడువుగా నిర్ణయించారు. ఈ గడువులోపు ఫ్రాంచైజీలు తాము విడుదల చేయాలనుకుంటున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లల్లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు జట్లల్లో కూడా దాదాపుగా అయిదు నుంచి ఎనిమిది మంది వరకు ప్లేయర్లను ఆక్షన్ కోసం విడుదల చేయవచ్చు.
చెన్నై సూపర్ కింగ్స్ కు సంబంధించినంత వరకు దీపక్ హుడా, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, సామ్ కుర్రన్, డెవాన్ కాన్వే వేలంలో నిలిచే అవకాశం ఉంది. వారిని రిటెన్షన్ చేసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ పెద్దగా ఆసక్తి చూపట్లేదు. దీంతో పాటు రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ నుండి రిటైర్ కావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి ఉంది. ఈ రిటైర్మెంట్ వల్ల చెన్నై సూపర్ కింగ్స్ వద్ద అదనంగా 9.75 కోట్ల రూపాయలు మిగిలినట్టయింది. ఈ మొత్తంతో మరో ఆల్ రౌండర్ ను తీసుకోవచ్చు.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కూడా భారీ మార్పులు చేపట్టవచ్చు. కేప్టెన్ వికెట్ కీపర్ సంజు శాంసన్‌ను రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ ట్రేడ్ డీల్ కుదరకపోతే అతన్ని ఆక్షన్ కోసం విడుదల చేయడం దాదాపుగా ఖరారవుతుంది. అతన్ని కొనుగోలు చేయడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉంది. అలాగే- శ్రీలంకకు చెందిన స్పిన్నర్లు వనిందు హసరంగా, మహీష్ తీక్షణలను కూడా విడుదల చేయాలని ఫ్రాంచైజీ భావిస్తోంది. కుమార్ సంగక్కర హెడ్ కోచ్‌గా తిరిగి రావడంతో దీనికి బ్రేక్ పడొచ్చు.












Click it and Unblock the Notifications