T20 World Cup 2026: జింబాబ్వే మ్యాచ్ వేళ మరో షాక్-కీలక ఆల్ రౌండర్ దూరం..!
టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ టోర్నీలో గ్రూప్ దశను ఘనంగా ఆరంభించడంతో పాటు వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి అజేయంగా సూపర్ 8లోకి అడుగుపెట్టిన టీమ్ ఇండియాకు అక్కడి నుంచి కష్టాలు మొదలయ్యాయి. సూపర్ 8 తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓటమిపాలైన టీమిండియా.. మిగిలిన జింబాబ్వే, వెస్టిండీస్ మ్యాచ్ లు గెలిచి సెమీస్ రేసులోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో మరో షాక్ తగిలింది.
తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో టీమిండియా ఆల్ రౌండర్ రింకూ సింగ్ (Rinku Singh) ఇవాళ జట్టుకు దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 పోరు వేళ నిర్వహిస్తున్న టీమ్ క్యాంప్ నుంచి రింకూ సింగ్ అర్ధాంతరంగా తప్పుకుని ఇంటికి వెళ్లిపోయాడు. రింకూ సింగ్ తండ్రి స్టేజ్-4 లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆయన ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్ తో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ క్లిష్ట సమయంలో తన కుటుంబంతో ఉండటానికి వీలుగా రింకూ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ మెగా టోర్నీ కోసం ఎంపిక చేసిన భారతజట్టులో రింకూ సింగ్ సభ్యుడు. ఇప్పటివరకూ ఇండియా ఆడిన అన్ని మ్యాచ్ లలోనూ రింకూ ఆడాడు. అయితే ప్రదర్శన మాత్రం ఆశాజనంగా లేదు. ఇలాంటి సమయంలో జట్టుకు దూరమైన రింకూ సింగ్.. తిరిగి జట్టులో చేరతాడా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. తాజా పరిస్థితిని జట్టు యాజమాన్యం నిశితంగా పరిశీలిస్తోంది. జట్టుకు మంచి ఫినిషర్ గా పేరున్న రింకూ సింగ్.. ఫీల్డింగ్ లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. దీంతో రింకూ లేని లోటు తదుపరి మ్యాచ్ లపై కనిపించబోతోంది. ఇప్పటికే గాయం కారణంగా హర్షిత్ రాణా జట్టుకు దూరమయ్యాడు.












Click it and Unblock the Notifications