ముంబై వద్దు..చెన్నై సూపర్ కింగ్స్ అసలే వద్దు: ఆ టీమ్‌కు ఐపీఎల్ స్టార్
IPL 2025: వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్‌లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించబోతోంది.ఈ మెగా టోర్నమెంట్ ఆడే 10 ఫ్రాంఛైజీల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో ప్రక్షాళనకు దిగాయి. ఈ దఫా జరిగే మెగా వేలం పాట సందర్భంగా దాదాపుగా కొత్త ముఖాలకు చోటు కల్పించవచ్చు.
గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి వేటు హెడ్ కోచ్‌పై వేయటం ఖాయమైనట్టే. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాకు ఉద్వాసన పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మూడు సంవత్సరాల ఆశీష్ నెహ్రా కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ దాన్ని రెన్యూవల్ చేయకపోవడం..ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది.

మెగా వేలం పాట కంటే ముందే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలు లేకపోలేదు. జట్టు ఆవిర్భావం నుంచి అంటే 2022 నుంచీ హెడ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు ఆశీష్ నెహ్రా. కోచ్‌తో పాటు కొందరు ప్లేయర్లను కూడా తొలగించవచ్చని చెబుతున్నారు. ఈ జాబితాలో కొందరు విదేశీ ప్లేయర్లు కూడా ఉండొచ్చు.
అదే సమయంలో కోల్‌కత నైట్ రైడర్స్ కూడా కొత్త మెంటార్ కమ్ డైరెక్టర్‌ను వెదుక్కునే పనిలో పడింది. మొన్నటివరకు ఈ హోదాలో పని చేసిన గౌతమ్ గంభీర్.. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా అపాయింట్ కావడం వల్ల ఈ స్థానం ఖాళీ అయింది. కొందరు మాజీ ప్లేయర్ల పేర్లను పరిశీలిస్తోంది.
నైట్ రైడర్స్ మిడిలార్డర్ బ్యాటర్ రింకూ సింగ్‌పైనా వేటు పడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఈ సీజన్‌లో అతను ఘోరంగా విఫలం అయ్యాడు. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన ఈ బ్యాటర్.. చేసింది 168 పరుగులే. వ్యక్తిగత అత్యధిక స్కోర్.. 26. బ్యాటింగ్ సగటు 18. 67గా రికార్డయింది.
ఈ నేపథ్యంలో అతన్ని వదులుకోవాలని భావిస్తోంది కేకేఆర్ ఫ్రాంఛైజీ. మెగా వేలం పాట సందర్భంగా రిటైన్ చేసుకోకవచ్చు. అతన్ని విడుదల చేయవచ్చు. అదే జరిగితే- తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడటానికి ఇష్టపడుతానని రింకూ సింగ్ వెల్లడించాడు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్లల్లో కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపే అతను మొగ్గు చూపాడు. దీనికి కారణం లేదు. విరాట్ కోహ్లీ వంటి బ్యాటర్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకునే అవకాశం లభిస్తుందని, ఆ జట్టు తొలిసారిగా ఐపీఎల్ ఛాంపియన్‌గా ఆవిర్భవింపజేయడంలో కొద్దో గొప్పో పాత్ర పోషిస్తానని అన్నాడు.












Click it and Unblock the Notifications