హిట్ (లెస్) మ్యాన్: చివరి 10 ఐపీఎల్ మ్యాచ్‌లల్లో రోహిత్ చేసిన స్కోర్ ఇదే
GT vs MI: ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కష్టాలు తీరట్లేదు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయిందా జట్టు. అహ్మదాబాద్‌లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పటివరకు ఆడిన రెండింట్లోనూ ఘోరంగా ఓడింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి దిగజారింది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ టాప్ స్కోరర్ ఈ ఇన్నింగ్‌లో. 41 బంతుల్లో రెండు భారీ సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 63 పరుగులు కొట్టాడు. కేప్టెన్ శుభ్‌మన్ గిల్- 38, టాప్ ఆర్డర్ బ్యాటర్ జోస్ బట్లర్- 39 పరుగులతో రాణించారు. మిడిలార్డర్‌లో షెర్ఫానె రూథర్‌ఫర్డ్- 18 పరుగులు తప్ప మిగిలిన వాళ్లు చేసింది సింగిల్ డిజిట్టే.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఏ మాత్రం ప్రతిఘటించలేకపోయింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ఆ ఓవర్ నాలుగో బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మహ్మద్ సిరాజ్ వేసిన రిప్పర్‌కు అతని వద్ద సమాధానమే లేకుండా పోయింది.
ఆఫ్ సైడ్ స్టంప్‌కు కాస్త అవతల పిచ్ అయి వికెట్ల మీదికి దూసుకొచ్చిన ఆ బంతిని ఏ మాత్రం అంచనా వేయలేకపోయాడు రోహిత్ శర్మ. బంతిని అడ్డుకోవడానికి బ్యాట్‌ను అడ్డు పెట్టేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బ్యాట్ అండ్ ప్యాడ్ మధ్య నుంచి దూసుకొచ్చిన ఆ డెలివరీ మిడిల్ స్టంప్ బెయిల్‌ను ఎగురగొట్టింది. దీనితో ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వెనుదిరిగాడీ హిట్ మ్యాన్.
ఈ సీజన్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు చేసిన పరుగులు ఈ ఎనిమిదే. చెన్నై సూపర్ కింగ్స్‌పై చెపాక్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. ఇది కొత్తేమీ కాదు. వరుసగా విఫలమౌతూనే వస్తోన్నాడు రోహిత్. 2024 ఐపీఎల్ సీజన్ నుంచే వైఫల్యాలు వెంటాడుతున్నాయతనికి. దాని నుంచి తప్పించుకోలేకపోతున్నాడు.
ఐపీఎల్ 2024, ఇప్పటి ఈ రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే చివరి 10 మ్యాచ్‌లల్లో అతను చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయాడనేది స్పష్టమౌతోంది. ఈ పదింట్లో అతను కొట్టింది ఒకే ఒక్క హాఫ్ సెంచరీ.
చివరి 10 మ్యాచ్‌లల్లో 25 బంతుల్లో 36, అయిదు బంతుల్లో 6, ఎనిమిది బంతుల్లో 8, అయిదు బంతుల్లో 4, 12 బంతుల్లో 11, అయిదు బంతుల్లో 4, 24 బంతుల్లో 24, 38 బంతుల్లో 68, నాలుగు బంతుల్లో డకౌట్, నాలుగు బంతుల్లో 8 పరుగులు. దీన్ని బట్టి చూస్తే రోహిత్ శర్మ ఎంత ఒత్తిడికి లోనవుతున్నాడనేది అర్థం చేసుకోవచ్చు.












Click it and Unblock the Notifications