మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె
ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ ఎట్టకేలకు ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. సెంచరీతో ట్రాక్ ఎక్కాడు. బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. అతను ఫామ్ లోకి రావడం అభిమానులను ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకున్న ఈ ఓపెనర్ అద్భుతమైన శతకంతో తన సత్తా చాటాడు. జట్టు భారీ స్కోరు సాధించడంలో, ఘన విజయాన్ని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ ఆనందం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కు దక్కలేదు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన కారణంగా అతనిపై భారీ ఫైన్ పడింది. ఈ సీజన్ లో కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన కేప్టెన్ల జాబితాలో అతను మూడోవాడు. మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ స్లో ఓవర్-రేట్‌ను కొనసాగించినందుకు గైక్వాడ్‌పై జరిమానా పడింది.

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇది జట్టుకు తొలి తప్పు కావడంతో అతడిపై 12 లక్షల రూపాయల జరిమానా విధించింది బీసీసీఐ. ఈ సీజన్ లో ఇప్పటికే శ్రేయాస్ అయ్యర్ రెండుసార్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు. మార్చి 31న న్యూ చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్-రేట్ కారణంగా అతడు సీజన్‌లో మొదటిసారి జరిమానాకు గురయ్యాడు.
ఈ నెల 2న చెన్నైతో జరిగిన తదుపరి మ్యాచ్‌లోనే అయ్యర్ మళ్లీ నియమావళిని ఉల్లంఘించాడు. ఇది రెండో నేరం కావడంతో అతను 24 లక్షల రూపాయలను జరిమానాగా చెల్లించాల్సి వచ్చింది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఏప్రిల్ 8న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్-రేట్ కారణంగా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడు.
మరోవైపు, బీసీసీఐ ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ నితీష్ రాణాకూ జరిమానా విధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌తో వాగ్వాదానికి దిగినందుకు ఈ చర్య తీసుకున్నారు. 19వ ఓవర్‌లో ట్రిస్టన్ స్టబ్స్ గ్లోవ్స్ మార్చుకోవడానికి మ్యాచ్ అధికారి అనుమతించకపోవడం దీనికి కారణమైంది. స్టబ్స్ అవుట్ అయ్యాడు. దీంతో నితీష్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు.
రాణాకు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్ 1 ఉల్లంఘన కింద మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.3 ని అతను ఉల్లంఘించిట్లు బీసీసీఐ గుర్తించింది. అతనికి చెల్లించాల్సిన మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది.












Click it and Unblock the Notifications