స్మృతి మంధాన పెళ్లి డేట్ రహస్యాన్ని బయటపెట్టిన పలాష్ తల్లి!
Smriti Mandhana Wedding: భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ వివాహం నవంబర్ 23న వాయిదా పడిన సంగతి తెలిసిందే. క్రికెట్, బాలీవుడ్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పెళ్లిని అకస్మాత్తుగా నిలిపివేయవలసి వచ్చింది. పెళ్లి రోజున స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. మరుసటి రోజు స్మృతి మంధానకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా ఎసిడిటీ సమస్యతో ఆస్పత్రిలో చేరారు. అనంతరం దీనికి ఒక రోజు తర్వాత పలాష్ ముచ్చల్‌కు సంబంధించిన కొన్ని చాట్ స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం స్మృతి మంధాన తండ్రి, కాబోయే భర్త పలాష్ ముచ్చల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో నవంబర్ 23న వివాహానికి కొద్ది గంటల ముందు ఈ భారత క్రికెటర్ తండ్రికి గుండెపోటు రావడంతో పెళ్లిని నిరవధికంగా వాయిదా వేశారు. ఒత్తిడి కారణంగా స్మృతి తండ్రి ఆరోగ్యం క్షీణించిందని, పెళ్లి వాయిదా పడడం వల్ల పలాష్ ఆరోగ్యం కూడా దెబ్బతిందని తెలిసింది. అయితే వారి వివాహం గురించి పలాష్ తల్లి అమితా ముచ్చల్ ఓ కీలక ప్రకటన చేశారు.

వారిద్దరి పరిస్థితి ఎలా ఉంది?
అయితే ఇప్పుడు వారిద్దరి ఆరోగ్యం మెరుగైంది, కానీ కొత్త పెళ్లి డేట్ గురించి అందరూ మౌనం వహించారు. పలాష్ తల్లి అమితా ముచ్ఛల్ ఈ వివాహం త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి రోజు జరిగిన సంఘటనల కారణంగా స్మృతి, పలాష్ ఇద్దరూ బాధపడుతున్నారని చెప్పారు. పెళ్లి తర్వాత స్మృతికి ప్రత్యేక స్వాగతం పలికేందుకు తాము ప్లాన్ చేశామని ఆమె వెల్లడించారు. "స్మృతి, పలాష్ ఇద్దరూ బాధలో ఉన్నారు. తన భార్యతో కలిసి ఇంటికి రావాలనేది పలాష్ కల. పెళ్లి త్వరలోనే జరుగుతుంది" అని ఆమె చెప్పారు.
స్మృతి మంధాన కోసం డబ్ల్యూబీబీఎల్‌ను వదులుకున్న జెమీమా
స్మృతి మంధాన పరిస్థితిని చూసి భారత మహిళా క్రికెట్ జట్టు పవర్ హిట్టర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ కష్ట సమయంలో స్మృతితో ఉండేందుకు ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) నుంచి తన పేరును ఉపసంహరించుకుంది. ఈ సీజన్‌లో భారత్ తరపున ఆడుతున్న ఏకైక క్రీడాకారిణి జెమీమానే కావడం గమనార్హం. ఆమెను బ్రిస్బేన్ హీట్స్ జట్టులోకి తీసుకున్నారు. ఈ సీజన్‌లో ఆమె ఇప్పటివరకు ఫామ్ కోసం కష్టపడుతోంది. జెమీమా మూడు మ్యాచ్‌లలో కేవలం 37 పరుగులు మాత్రమే చేయగలిగింది.












Click it and Unblock the Notifications