SRH.. అంత డబ్బుంది- జరంత మంచోళ్లను కొనుండ్రి బై..!!
ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఐపీఎల్ మినీ ఆక్షన్ కు గడువు సమీపిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబి వేదికగా ఈ నెల 16వ తేదీన జరగనుందీ బిగ్ ఈవెంట్. రెండు రోజుల పాటు కొనసాగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు అబుదాబిలోని ఎతిహాద్ అరేనాలో ప్రారంభమవుతుంది. మొదట క్యాప్డ్, ఆ తర్వాత అన్ క్యాప్డ్ ప్లేయర్ల వేలం పాటను నిర్వహిస్తారు ప్రజెంటర్లు.
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం బీసీసీఐ తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 350 మంది ప్లేయర్లతో కూడిన లిస్ట్ ఇది. మొత్తం 1,355 మంది తమ పేర్లను నమోదు చేసుకోగా.. అవన్నీ కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి. చివరి నిమిషంలో ఈ తుది జాబితాలో కొత్తగా 25 మంది ఆటగాళ్లకు చోటు దక్కింది. ఇలా చేరిన ఈ 25 మందిలో దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ సైతం ఉన్నాడు. మొదట్లో అతని పేరు లేదీ లిస్ట్ లో.

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో తన పేరును నమోదు చేసుకోలేదీ డాషింగ్ ఓపెనర్. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని.. రీ ఎంట్రీ ఇచ్చాడు. భారత్ తో జరిగిన చివరి వన్డేలో సెంచరీతో అదరగొట్టాడు. దీంతో ఫ్రాంచైజీ సిఫారసుతో అతనికి చోటు లభించింది. డికాక్ తన బేసిక్ ప్రైస్ ను సగానికి తగ్గించుకున్నాడు. కోటి రూపాయల బ్రాకెట్‌లో ఉన్నాడు. గత మెగా వేలంలో అతని కనీస ధర రెండు కోట్ల రూపాయలుగా ఉండేది. అదే మొత్తానికి అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
కిందటి నెలలో వేలం పాట కోసం రిలీజ్ చేసిన తొమ్మిదిమంది ఆటగాళ్ల డికాక్ ఒకడు. ఫ్రాంఛైజీలో స్వయంగా అతని పేరును చేర్చాలంటూ సిఫారసు చేసిన నేపథ్యంలో ఈ సీజన్ లో అతనికి మంచి రేట్ పలికే అవకాశం ఉంది. శ్రీలంకకు చెందిన దునిత్ వెల్లాలగే, ట్రావెన్ మాథ్యూ, బినూరా ఫెర్నాండో, కుశాల్ పెరీరా కూడా వీరిలో ఉన్నారు.
నిధుల విషయంలో.. కోల్ కత నైట్ రైడర్స్ పర్స్ లో 64.3 కోట్ల రూపాయల అమౌంట్ ఉంది. తొమ్మిది మంది ప్లేయర్లను విడుదల చేసినందున భారీ మొత్తాన్ని వేలం కోసం మిగిల్చుకుంది. చెన్నై సూపర్ కింగ్స్- రూ.43.4 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ.25.5 కోట్లు మిగిలిన రెండు స్థానాలో ఉన్నాయి. మొత్తం 77 స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 31 విదేశీ ఆటగాళ్లకు కేటాయించారు. యాక్సెలరేటెడ్ రౌండ్ లో 71 నుండి 350 మంది ప్లేయర్లు ఉంటారు.












Click it and Unblock the Notifications