IPL 2026: మలుపు తిప్పిన తెలుగోడు.. ముంబైకి అదిరిపోయే విజయం!
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తమ వరుస ఓటములకు ముగింపు పలికింది. నాలుగు పరాజయాల తర్వాత రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే పరుగుల పరంగా ముంబై ఇండియన్స్‌కు ఇది అతిపెద్ద విజయం.
తెలుగోడి విధ్వంసం..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసింది. తిలక్ వర్మ(45 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. నమన్ ధీర్(32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
గుజరాత్ బౌలర్లలో కగిసో రబడా(3/33) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ తలో వికెట్ తీసారు. 96 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ముంబై ఇండియన్స్‌ను తిలక్ వర్మ ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి ఐదో వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. హార్దిక్ వెనుదిరిగినా భారీ షాట్లతో సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు భారీ స్కోర్ అందించాడు.

నిప్పులు చెరిగిన ముంబై రేసు గుర్రం..
అనంతరం గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకు కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్(17 బంతుల్లో 5 ఫోర్లతో 26) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అశ్వని కుమార్(4/24) నాలుగు వికెట్లు తీయగా.. మిచెల్ సాంట్నర్(2/16), అల్లా ఘజన్‌ఫర్(2/17) రెండేసి వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు. వరుసగా మూడు విజయాల తర్వాత గుజరాత్ టైటాన్స్ జోరుకు ముంబై బ్రేక్ వేసింది.
కొంపముంచిన అశోక్ శర్మ..
గుజరాత్ టైటాన్స్ యువ పేసర్ అశోక్ శర్మ వేసిన 18వ ఓవర్ ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఈ ఓవర్‌లో తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వరుసగా ఐదు బంతులను 6, 4, 4, 6, 6 బౌండరీలకు తలించి 26 పరుగులు పిండుకున్నాడు.
ఈ ఓవర్ మ్యాచ్ గమనాన్నే మార్చేసింది. అప్పటి వరకు ముంబైని వణికించిన గుజరాత్ టైటాన్స్ ఒక్కసారిగా చేతులెత్తేసింది. ఈ ఓవర్ తర్వాత 7 బంతులే ఎదుర్కొన్న తిలక్ వర్మ రెండు సిక్స్‌లు, మూడు బౌండరీలు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అశోక్ వర్మ ఓవర్‌కు ముందు ముంబై ఇండియన్స్ 141/4 స్కోర్‌తో నిలిచింది. అశోక్ వర్మ కాస్త కట్టడిగా వేసి ఉంటే ముంబై 165-170 పరుగులకే పరిమితమయ్యేది. కానీ తిలక్ వర్మ తన విధ్వంసంతో మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్ నుంచి లాగేసుకున్నాడు. తిలక్ అసాధారణ బ్యాటింగ్‌తో ముంబై బౌలర్లు రెట్టించిన ఉత్సాహంతో బౌలింగ్ చేశారు. జస్‌ప్రీత్ బుమ్రా ఎట్టకేలకు వికెట్ల ఖాతా తెరిచాడు.












Click it and Unblock the Notifications