చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ: కోహ్లీ, బాబర్ రికార్డ్ బ్రేక్!
Vaibhav Suryavanshi: భారత యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026లో భాగంగా శనివారం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ 14 ఏళ్ల కుర్రాడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 67 బంతుల్లో 72 పరుగులు (6 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి పలు ప్రపంచ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
అతి చిన్న వయసులో హాఫ్ సెంచరీ
వైభవ్ కేవలం 30 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. దీని ద్వారా అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అతి చిన్న వయసులో (14 ఏళ్ల 296 రోజులు) 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు అఫ్గానిస్తాన్ ఆటగాడు షాహిదుల్లా కమల్ (15 ఏళ్ల 19 రోజులు) పేరిట ఉండేది. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ఇప్పుడు ఈ జాబితాలో మూడో స్థానానికి పడిపోయాడు.

అండర్-19 వరల్డ్ కప్‌లో అత్యంత పిన్న వయసులో 50+ చేసిన టాప్-3 బ్యాటర్లు:
*వైభవ్ సూర్యవంశీ (భారత్): 14 ఏళ్ల 296 రోజులు (2026)
*షాహిదుల్లా కమల్ (అఫ్గానిస్తాన్): 15 ఏళ్ల 19 రోజులు (2014)
*బాబర్ ఆజం (పాకిస్థాన్): 15 ఏళ్ల 92 రోజులు (2010)
కింగ్ కోహ్లీ రికార్డ్ కూడా గల్లంతు!
వైభవ్ సూర్యవంశీ కేవలం బాబర్ ఆజంనే కాదు.. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డును కూడా అధిగమించాడు. యూత్ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీని వెనక్కి నెట్టాడు. వైభవ్ సూర్యవంశీ 20 మ్యాచ్‌ల్లో 1,047 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ 28 మ్యాచ్‌ల్లో 978 పరుగులు చేశాడు. భారత్ తరపున ఈ జాబితాలో విజయ్ జోల్ (1,404 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఉద్రిక్తతల మధ్య మ్యాచ్
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మైదానంలో ఉద్రిక్తత కనిపించింది. టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే, బంగ్లా కెప్టెన్ అజీజుల్ హకీమ్ తమీమ్ సాంప్రదాయబద్ధంగా ఇచ్చుకునే కరచాలనం (హ్యాండ్ షేక్) చేసుకోకపోవడం గమనార్హం. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.












Click it and Unblock the Notifications