యుజ్వేంద్ర చాహల్ మెసేజ్ రచ్చ.. ఎట్టకేలకు నోరు విప్పిన తానియా!
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మెసేజ్ చేశాడంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలపై నటి తానియా ఛటర్జీ ఎట్టకేలకు స్పందించారు. ఈ వివాదం ముదురుతున్న తరుణంలో ఆమె స్పందించడం విశేషం. చాహల్ తనకు మెసేజ్ పంపిన మాట వాస్తవమేనని.. అయితే దానిని తప్పుగా చిత్రీకరించి ఆయనను బదనాం చేయాలనే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని తానియా ఛటర్జీ స్పష్టం చేశారు.
అసలు వివాదం ఎలా మొదలైంది?
ఇటీవల ఓ సందర్భంలో తానియా ఛటర్జీ పాపరాజీలకు తన మొబైల్ ఫోన్ చూపిస్తూ.. యుజ్వేంద్ర చాహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశాడని వెల్లడించింది. ఆ వీడియో క్షణాల్లో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు ఆమెపై మండిపడ్డారు. పబ్లిసిటీ కోసం ఓ సెలబ్రిటీ పరువు తీస్తున్నారంటూ నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. దీనిపై స్పందించిన తానియా ఛటర్జీ.. "అది కేవలం ఒక సాధారణ మెసేజ్. అందులో వివాదానికి తావు లేదు. దేశం కోసం ఆడే క్రీడాకారుల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది" అని పేర్కొన్నారు.

మెసేజ్ వివరాలిలా..
యుజ్వేంద్ర చాహల్ తనను ఉద్దేశించి 'క్యూట్' అని మెసేజ్ చేశారని.. అప్పట్లో ఐపీఎల్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో అది జరిగిందని తానియా ఛటర్జీ వివరించారు. ఓ ఇంటర్వ్యూలో మాటల మధ్యలో చాహల్ ప్రస్తావన వస్తే తనలో ఉన్న అమాయకత్వంతో ఆ విషయాన్ని దాచకుండా చెప్పేశానని ఆమె అన్నారు. "ఆయన నన్ను పొగిడారు, అది నాకు సంతోషాన్ని ఇచ్చింది. కేవలం ఒక ప్రశంసను పంచుకున్నాను తప్ప, ఇందులో పరువు నష్టం కలిగించే అంశం ఏముందో నాకు అర్థం కావడం లేదు" అని తానియా ఛటర్జీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది 2023 నాటి పాత ముచ్చట
ఈ మెసేజ్‌లు ఇప్పటివి కావని.. 2023 సంవత్సరంలో జరిగినవని తానియా క్లారిటీ ఇచ్చారు. అప్పటికే చాహల్‌కు వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిందేనని, తనకు పబ్లిసిటీ కావాలనుకుంటే అప్పుడే దీనిని రచ్చ చేసేదాన్నని ఆమె గుర్తు చేశారు. "నాకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదు. ఆయన ఒక్కసారి కాదు, రెండుసార్లు మెసేజ్ చేశారు. నేను ఆ మెసేజ్‌లను చాలా ఆలస్యంగా చూశాను. దానిని ఇప్పుడు వివాదం చేయాల్సిన అవసరం లేదు" అని తానియా ఛటర్జీ స్పష్టం చేశారు.
చట్టపరమైన చర్యలపై క్లారిటీ
ఈ వివాదం పరువు నష్టం దావా వరకు వెళ్లే అవకాశం ఉందన్న వార్తలపై కూడా తానియా ఛటర్జీ స్పందించారు. ప్రస్తుతం తన న్యాయవాదులు ఈ విషయాన్ని పర్యవేక్షిస్తున్నారని, వారి సూచన మేరకు తాను ఎక్కువ విషయాలు వెల్లడించడం లేదని చెప్పారు. 'గందీ బాత్', 'జాల్' వంటి వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు పొందిన తానియా.. చాహల్ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని, కేవలం ఒక ఇన్సిడెంట్‌ను మాత్రమే బయటపెట్టానని తన వివరణను ముగించారు.












Click it and Unblock the Notifications