దాసరిపై పవన్ గన్?

కదన రంగంలోకి దూకి చిరంజీవి ప్రజారాజ్యం మీద, చంద్రబాబు మీద విమర్శలు గుప్పించమని వైఎస్, హైకమాండ్ ఆదేశిస్తే షాట్ రెడీ అని చెప్పడానికి దాసరి నారాయణ రావు సిద్ధంగా ఉన్నారు. దాసరి గతంలో ఎన్టీఆర్ మీద, రామోజీరావు మీద వ్యంగ్య సినిమాలు తీశారు. ఇప్పుడు దాసరి ప్లేటు మార్చి రామోజీరావుకు సన్నిహితంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తనను ఇప్పుడు పెద్దగా ఆదరించడం లేదన్న బాధ దాసరికి ఉన్నా, ఆయనకు ఇప్పుడు ఆ పార్టీ తప్ప గత్యంతరం లేదు. తన కులం, తన జిల్లా వాడైన చిరంజీవి తనను ప్రజారాజ్యంలో పెద్ద దిక్కుగా పెట్టుకుంటాడని ఆశించిన దాసరి భంగపడ్డారు. ఆయన పెద్దరికం మీద గౌరవం ఉన్నా చిరంజీవి ఆయనను తన పార్టీలోకి ఆహ్వానించలేదు.
దాసరి నారాయణరావు తాజా చిత్రం "ముఠామేస్త్రి"లో చిరంజీవి మీద, ఆయన కుటుంబం మీద, ప్రజారాజ్యం పార్టీ మీద సెటైర్లు ఉన్నాయని రషెస్ చూసిన వాళ్ళు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో దాసరి మీద, మాటల దాడి చేయడానికి, గతంలో దాసరి పాల్పడిన అక్రమాలను బహిర్గతం చేయడానికి పవన్ కల్యాణ్ సిద్ధమవుతున్నట్టు తెలిసింది. అందుకు చిరంజీవి నుంచి క్లియరెన్స్ వచ్చినట్టు సమాచారం. దాసరి నారాయణరావు చిరంజీవి మీద విమర్శలు చేస్తే దాసరి మీద పవర్ స్టార్ చెలరేగిపోవడం ఖాయం. ఆయన గతంలో పోలీస్ స్టేషన్ లో తన రివాల్వర్ ను సరెండర్ చేసినా, ఇప్పుడు తనకు ఇద్దరు గన్ మెన్ లు కావాలని దరఖాస్తు చేసుకున్నాడు. రాజ్యసభ సభ్యుడి హోదాలో దాసరికి గన్ మన్ లు ఉన్నారు. పవన్ కు ఇవాళో రేపో గన్ మన్లు వస్తారు.
దాసరి నారాయణరావు, మోహన్ బాబు ఎంత సన్నిహితులో అందరికీ తెలుసు. ఒక సభలో చిరంజీవిని పరోక్షంగా విమర్శించిన మోహన్ బాబుతో అదే సభలో పవన్ కల్యాణ్ చెడుగుడు ఆడుకున్న విషయం తెలిసిందే. "ముఠా మేస్త్రి" సిన్మా విడుదలయ్యాక, దాసరి కాంగ్రెస్ తరఫున రోడ్ల మీదికి వచ్చాక అప్పుడు తెలుస్తుంది పవన్ తడాఖా. అయితే విమర్శలు పార్టీల వరకు పరిమితమైతే ఫర్వాలేదు, వ్యక్తిగత విమర్శలను మాత్రం సామాన్య జనం హర్షించరు.












Click it and Unblock the Notifications