కొడనాడ్ రిసార్ట్స్ లో జయ జయహో!

తనకు అచ్చొచ్చిన కొడనాడు ఎస్టేట్ కు వెళ్లడం ఆనవాయితీగా పెట్టుకున్న పురచ్చితలైవి ఈసారి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారోనని రాజకీయ వర్గాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. కొడనాడు ఎస్టేట్‌లో విశ్రాంతి నిమిత్తం జయలలిత చెన్నయ్ నుండి శుక్రవారం ప్రత్యేక విమానంలో బయలుదేరి కోవై చేరుకుంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గంలోకొడనాడుకు చేరుకుంటారని సమాచారం.
అన్నాడీఎంకేకు చెందిన సీనియర్‌లు, మాజీలు పలువురు పార్టీ పట్ల అసంతృప్తి కారణంగా అధికార డీఎంకే వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ చర్యలతో ఖంగుతిన్న జయలలిత నగరంలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి ఇటీవల కాలంలో రెండు రోజులకోసారి వచ్చి నాయకులు, పార్టీ నిర్వాహకులు, కార్యకర్తల మధ్య మాట్లాడుతున్నారు. బుధవారం పార్టీ కార్యకర్తల నుండే కాకుండా ప్రజల నుండి కూడా ఆమె వినతిపత్రాలు స్వీకరించారు.
పార్టీ కార్యాలయంలో గడిపి, తనను చూడాలని వచ్చినవారందరినీ ఆప్యాయంగా పలుకరించారు. ఈ నేపధ్యంలో ఆమె కొడనాడుకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొడనాడుకు ఎప్పుడు వెళ్లినా జయ సంచనల నిర్ణయాలు తీసుకుంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అయితే గతంలో కొడనాడుకు వెళ్లినప్పుడు మాత్రం జయ ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకోలేదు.మరి ఈసారి ఏం చేయబోతున్నారోనని ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications