• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మన హీరోలు మారరా?

By Pratap
|

Jr Ntr
బాక్సాఫీసు వద్ద జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా బోల్తా కొట్టిన తర్వాత మన తెలుగు హీరోలు మారరా అని మరోసారి అనిపిస్తోంది. నిజానికి, బృందావనం సినిమాతో జూనియర్ ఎన్టీఆర్‌లో చాలా మార్పు వచ్చిందని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన కూడా ఇతర హీరోలకు ఏ మాత్రం తీసిపోరని మరోసారి రుజువు చేసుకున్నారు. కోట్ల రూపాయాల్లో డబ్బులు తీసుకుని, సినిమా అయిపోందని అనిపిస్తే చాలుననే ఉద్దేశంతో మాత్రమే కాకుండా తమ మాస్ ఇమేజ్‌కు, హీరో వర్షిప్‌కు విఘాతం కలగకూడదనే కోరికతో మన హీరోలు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని అనిపిస్తోంది.

ఏడాదికి ఒక్కటో, రెండో సినిమాలు మాత్రమే చేస్తూ కూడా ఇంత అజాగ్రత్తగా తెలుగు హీరోలు ఎందుకు ఉంటున్నారనేది కూడా అర్థం కావడం లేదు. అట్టహాసం తప్ప రక్త మాంసాలు లేని సినిమాలను ఎందుకు అంగీకరిస్తున్నారనేది కూడా అర్థం కాని విషయంగానే మారింది. అయితే, ఆలోచిస్తే అవి అర్థం కాని విషయాలేమీ కావు. కథాబలం లేకుండా తమ హీరోయిజం, మాస్ ఇమేజ్ మాత్రమే తమ ఫ్యాన్ ఫోలోయింగ్ ద్వారా సినిమాలు కాసుల వర్షం కురిపిస్తాయని, సినిమాలు బాక్సాఫీసును బద్దలు కొడతాయని వారు భావిస్తూ ఉండవచ్చు. కానీ, సెంటిమెంటు, కథాబలం లేని సినిమాలు విజయం సాధించిన దాఖలు లేవు.

తెలుగు హీరోలు తెలుగు ప్రేక్షకుడిని ఒక రకంగా అవమానిస్తున్నారని చెప్పవచ్చు. తెలుగు ప్రేక్షుకుడి బుర్ర మట్టితో తయారైందని వారు భావిస్తూ ఉండవచ్చు. లేదంటే, తమను తాము హీరోలు దైవాంశ సంభూతులుగా భావిస్తూ ఉండవచ్చు. తామెక్కడో అందరాని పైమెట్టు మీద ఉంటే, నేల మీద నడిచే ప్రజలు తమ సినిమాలు చూడడానికి అంగలారుస్తారని, తమ బొమ్మలు చూడడానికి చొంగ కారుస్తారని భావిస్తూ ఉండవచ్చు. కానీ తెలుగు ప్రేక్షకుడు అంత దీనమైన స్థితిలో లేడనే విషయాన్ని హీరోలే కాదు, దర్సక మహానుభావులు కూడా గ్రహించాల్సి ఉంటుంది.

తెలుగు సినిమాల్లో హీరోయిన్ ఒక్క మట్టిముద్దగా మాత్రమే దర్శనమిస్తోంది. ఉడుపులు సాధ్యమైనంత వరకు విప్పేసే పాటల్లో చేతులూ కాళ్లే కాదు, నడుమూ, వక్షోజాలూ ఆడిస్తే తెలుగు ప్రేక్షకుడు మరీ మరీ గుడ్లప్పగించి చూస్తాడని వెర్రి ఆలోచనలు మన సినీ పెద్దలు చేస్తూ ఉండవచ్చు. ఆరు డ్యూయెట్లు, నాలుగు ఫైట్లు, ఓ ఐటం సాంగ్ ఉంటే చాలు అనుకుంటూ ఉండవచ్చు. హాస్యం కూడా ముతగ్గా ఉంటుంది. హాస్యం పేరుతో నాసిరకం వెగటును సినిమాల్లో గుప్పిస్తున్నారు. కొత్తగా గ్రాఫిక్స్‌ను తెర మీదికి తెచ్చి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నామని కూడా సినీ ప్రముఖులు భావిస్తూ ఉండవచ్చు. ఎంతటి ఆధునిక సాంకేతిక పరిజ్ఢానమైనా కథా బలం లేకుండా విజయం సాధ్యం కాదనేది గుర్తించడానికి వారికి ఈ జన్మ సరిపోకపోవచ్చు.

అంతేకాదు, ప్రేక్షకుడు సినిమాలో లీనం కావాలంటే, ఎక్కడో ఓ చోట సినిమాలోని పాత్రలతో మమేకం కావాల్సి ఉంటుంది. వాటిలో తమను తాము చూసుకునే విధంగా ఉండాలి. దాన్ని విస్మరించినంత కాలం తెలుగు సినిమా బాగుపడదు. లేదంటే ఒక్కసారి మన ప్రాచీన ఆలంకారికులు చెప్పిన రససిద్ధాంతాన్ని కనీసం దర్శకుల్లో ఒక్కరైనా అధ్యయనం చేస్తే మంచిది.

English summary
After Jr NTR's Shakti disaster at box office, it os evident that Telugu heroes are not in a situation to change. They are not interested to in story line. It can be said that they are under estimating the public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X