అన్న ఎన్టీఆర్ గెటప్‌లో నాగం భరోసా

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఆయన అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. తెలంగాణపై విభేదించి బయటకు వచ్చారు. తెలంగాణ కోసం తాను చిత్తశుద్ధితో ఉన్నానని ప్రకటించుకోవడానికి ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అహ్వానించినా ఆయన ఆ పార్టీలో చేరడానికి ఇష్టపడడం లేదు. కెసిఆర్ రాజకీయాల్లో తనకన్నా జూనియర్ కావడమే అందుకు కారణమా, మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే, జనార్దన్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏమిటనేది మాత్రం తెలియడం లేదు. అన్ని పార్టీలు ఒకే ఎజెండాతో, జెండాతో తెలంగాణ కోసం ముందుకు రావాలని ఆయన అంటున్నారు. నాగం జనార్దన్ రెడ్డిని వదిలేయడానికి తెలంగాణ జెఎసి సిద్ధంగా లేదు. మరోవైపు, ఆయనను తమ వైపు లాక్కోవడానికి బిజెపి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
నాగం జనార్దన్ రెడ్డి భరోసా యాత్రలో తెలంగాణ జెఎసి నాయకులు, బిజెపి నాయకులతో పాటు న్యూడెమొక్రసీ నాయకులు కూడా పాల్గొంటున్నారు. నాగం జనార్దన్ రెడ్డి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. మరి, ఏ వ్యూహంతో నాగం జనార్దన్ రెడ్డి ముందుకు సాగుతున్నారనేది అర్థం కాక తెలంగాణ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి.
కాంగ్రెసును భూస్థాపితం చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదని నాగం గట్టిగా చెబుతున్నారు. కెసిఆర్ కాంగ్రెసు పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారనే అభిప్రాయం ఆయనకు కూడా ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ, తెలంగాణ పార్టీలను, సంస్థలను ఆయన ఎక్కడా తప్పు పట్టడం లేదు, కాకుంటే తన దారికి రావాలని ఆయన అన్యాపదేశంగా సూచిస్తూనే ఉన్నారు. ఏమో, నాగం జనార్దన్ రెడ్డి ఎటు వెళ్తారో ఇప్పుడే చెప్పడం కష్టం.












Click it and Unblock the Notifications