బాబుపై హరి ఫైట్: తెర మీదికి అన్న టిడిపి?

చంద్రబాబు, హరికృష్ణ మధ్య చాలా కాలంనుంచి ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని, రాజీనామాతో అవి బయటపడ్డాయని అంటున్నారు. హరికృష్ణ నిర్ణయం వెనక బలమైన కారణాలు వున్నాయని, ఇందులో కొందరు కుటుంబ సభ్యుల ప్రోద్బలం లేకపోలేదని అంటున్నారు. అవి తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చునని అంటున్నారు. చంద్రబాబు, హరి మధ్య నెలకొన్న విభేదాలు బాలకృష్ట కుమార్తె వివాహంపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే.
తేజస్విని పెళ్లికి హరికృష్ణతో పాటు ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా హాజరు కాలేదు. దాని ప్రభావం ఎలా ఉంటుందని తెలిసి కూడా వివాహానికి రాలేదంటే పోరాటానికి వారు సిద్ధపడినట్లు భావిస్తున్నారు. హరికృష్ణ తన కుమారుడు జూనియర్ ఎన్టీర్‌తో కలిసి వ్యూహత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే, వారు ఆచితూచి హరికృష్ణ వ్యవహారంపై మాట్లాడుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లరని అంటున్నారు.
సమైక్య నినాదంతో ప్రజల ముందుకు వెళ్లేందుకు హరికృష్ణ తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో హరికృష్ణ తన కుమారునితో పాటు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని, ఒక వేళ హరికృష్ణ ఇదే నిర్ణయం మీద ఉంటే తెలుగుదేశం పార్టీ చిక్కుల్లో పడక తప్పదని అంటున్నారు.
పార్టీకి వ్యతిరేకంగా హరికృష్ణ వ్యవహరించనున్నారని సంకేతాలు రావడంతో చంద్రబాబు మరో రెండు, మూడు రోజుల్లో తన వైఖరిని ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. ఈ వ్యవహారాన్ని ఎలా కొలిక్కి తేవాలని విషయంపై చంద్రబాబు ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో, కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications