ఏఐ ఉద్యోగాల రేసులో వెనుకబడ్డ హైదరాబాద్..! ఏ సిటీలు ముందున్నాయి ?
ప్రపంచవ్యాప్తంగా ఏఐ దూకుడు పెరుగుతోంది. కంపెనీలు ఏఐ, ఆటోమేషన్ ను ప్రవేశపెట్టి ఉద్యోగుల్ని తగ్గించుకోవాలని, తద్వారా లాభాలు పెంచుకోవాలని చూస్తున్నాయి. దీంతో వేల సంఖ్యలో ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయి. అదే సమయంలో ఏఐ ఉద్యోగాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది. వివిధ ఏఐ సంబంధిత ఉద్యోగాలకు తాజాగా ఆఫర్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏఐ ఉద్యోగాల కల్పనలో భారత్ లో ఏ నగరాలు ముందున్నాయో ఓసారి చూద్దాం..
మన దేశంలో ఐటీ పరిశ్రమల కేంద్రంగా ఉన్న రెండు నగరాలు హైదరాబాద్, బెంగళూరు. ఆ తర్వాత స్ధానాల్లో మిగిలిన నగరాలు ఉంటాయి. అయితే తాజాగా మారుతున్న పరిస్ధితుల్లో ఏఐ ఉద్యోగాల కల్పన దగ్గరికి వచ్చే సరికి బెంగళూరు పరిస్ధితి బాగానే ఉన్నా హైదరాబాద్ మాత్రం వెనుకబడుతోంది. ఈ ఏడాది అక్టోబర్ లో గూగుల్ ప్రకటించిన ఏఐ ఉద్యోగాల కల్పన ర్యాంకింగ్స్ లో బెంగళూరు దేశంలోనే టాప్ లో నిలిచింది. ఆ తర్వాతే మిగిలిన నగరాలున్నాయి.

ఏపీలోని విశాఖపట్నంలో తాజాగా ఏఐ డేటా సెంటర్ స్థాపనకు గూగుల్ ముందుకొచ్చింది. ఇది కార్యరూపం దాలిస్తే ఉద్యోగాలు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి చూస్తే దేశంలో ఏఐ ఉద్యోగాల కల్పనలో బెంగళూరు 26 శాతంతో తొలి స్ధానంలో ఉంది. ఆ తర్వాత పూణే 17 శాతం ఉద్యోగాల కల్పనతో రెండో స్ధానంలో ఉంది. ముంబై 13 శాతం ఏఐ ఉద్యోగాల కల్పనతో ఈ రేసులో మూడో స్ధానంలో ఉంది. హైదరాబాద్ మాత్రం కేవలం 10 శాతం ఉద్యోగాల కల్పనతో నాలుగో స్ధానం దక్కించుకుంది. ఆ తర్వాత 7 శాతంతో చెన్నై, రిమోట్ లో 3 శాతం, కోల్ కతా, అహ్మదాబాద్, కోయంబత్తూర్ రెండేసి శాతం చొప్పున ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.

భారత్ లో టెక్ సిటీగా పేరున్న బెంగళూరు నగరం ఐటీ జాబ్ క్యాపిటల్ గానూ ఉంది. ఇప్పుడు క్రమంగా ఏఐ ఆవిష్కరణల కేంద్రంగా కూడా మారుతోంది. అందుకే 26 శాతం ఏఐ ఉద్యోగాలను ఇది కల్పిస్తోంది. వేల సంఖ్యలో ఏఐ, ఎంఎల్ స్టార్టప్ లు ఇక్కడ పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరు నగరం 759 స్టార్టప్ లతో ప్రపంచవ్యాప్తంగా ఏఐ హబ్ లలో ఏడో స్ధానంలో ఉంది.
ఎఫ్ఐటీ నివేదిక ప్రకారం చూసినా బెంగళూరు 26 శాతం ఉద్యోగాలు కల్పిస్తోంది. పూణే 17శాతం, ఢిల్లీ 14శాతం తో పోలిస్తే బెంగళూరు ఇప్పటికే చాలా ముందుంది.












Click it and Unblock the Notifications