యాపిల్ లో భారీ కుదుపు
యాపిల్ సీఈఓ టిమ్ కుక్ రాజీనామా చేశారు. ఆ టెక్ దిగ్గజ సంస్థకు గుడ్ బై చెప్పారు. 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా కొనసాగిన బంధానికి దీంతో తెరపడింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ వరకు పదవి కొనసాగుతారు. ఆపిల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా మాత్రమే వ్యవహరిస్తారు. ఆయన వారసుడిగా జాన్ టెర్నస్ అపాయింట్ అయ్యారు. యాపిల్ సీఈఓ బాధ్యతలు టెర్మస్ నియామకాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది.
యాపిల్ సీఈఓగా పని చేయడం తన జీవితంలో అద్భుత సందర్భమని, ఆ సంస్థతో సాగిన అతి గొప్ప ప్రయాణానికి తెరపడిందని టిమ్ కుక్ పేర్కొన్నారు. టెర్నస్ సామర్థ్యాలను ప్రశంసించారు. ఓ అద్భుతమైన ఇంజినీర్ అని కితాబిచ్చారు. ఇంజినీరింగ్ మైండ్, ఇన్నోవేటివ్ సోల్ తో కూడిన దూరదృష్టి గల నాయకుడిగా ప్రశంసించారు. టెర్మస్ సామర్థ్యంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

స్టీవ్ జాబ్స్ మరణానికి ముందు 2011లో కుక్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో ఆపిల్ ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది. మ్యూజిక్, ఐక్లౌడ్, టీవీ+ సేవలతో పాటు ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి కీలక ఉత్పత్తుల వృద్ధి సాధించారు. సీఈఓ కాకముందు 1998లో కుక్ ఆపిల్‌లో ప్రపంచవ్యాప్త కార్యకలాపాలకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారు. అత్యంత సమర్థమైన గ్లోబల్ సప్లై చెయిన్‌ను నిర్మించి, అధిక లాభాలతో యాపిల్ వేగంగా ఎదగడానికి తోడ్పడ్డారు.
కుక్ హయాంలో.. ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ వంటి పరికరాలను ప్రవేశపెట్టింది. డ్యూక్ యూనివర్శిటీ నుండి ఎంబీఏ, ఆబర్న్ ఇండస్ట్రీస్ ఇంజినీరింగ్ లో డిగ్రీ చదివిన కుక్, యాపిల్‌లో చేరడానికి ముందు ఐబీఎం, కాంపాక్‌లలో పనిచేశారు. జాన్ టెర్నస్ ఆధ్వర్యంలో, ఆపిల్ హార్డ్‌వేర్ ఆవిష్కరణలతో పాటు విస్తరిస్తున్న సేవల పర్యావరణ వ్యవస్థపై దృష్టి సారించనుంది. పోటీ తత్వం, నియంత్రణలతో కూడిన ప్రపంచ టెక్ రంగంలో కంపెనీకి ఇది కీలకం అవుతుంది.
హార్డ్‌వేర్ ఇన్నోవేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై జాన్ టెర్మస్ కు మంచి పట్టు ఉంది. 50 ఏళ్ల టెర్నస్ 2001లో ఆపిల్‌లో చేరారు. మ్యాక్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్ వంటి ప్రధాన ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ చీఫ్ గా వ్యవహరించారు. ఆపిల్ ప్రస్తుతం ఏఐ, సెమీకండక్టర్ సాంకేతికతల్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ఎన్ డివియా మార్కెట్ విలువలో ఆపిల్‌ను అధిగమించగా, మెటా వంటి ప్రత్యర్థులు ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి కొత్త విభాగాల్లో సవాలు విసురుతున్నాయి.
ఈ నేపథ్యంలో అత్యంత విజయవంతమైన ఐఫోన్‌తో సహా ఆపిల్ పర్యావరణ వ్యవస్థలో ఏఐతో అనుసంధానించడమే టెర్నస్ ప్రధాన బాధ్యత. ఏఐ సామర్థ్యాల బలోపేతానికి సంస్థ సిరిలో గూగుల్ జెమినీ మోడల్‌ను చేర్చింది. ఆపిల్ తదుపరి తరం సాంకేతికతలలో తిరిగి పుంజుకోవాలని చూస్తున్నందున, టెర్నస్ ఫోల్డబుల్, స్మార్ట్ గ్లాసెస్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్-ఆధారిత వేరియేబుల్స్ వంటి కొత్త హార్డ్‌వేర్ విభాగాలను బలోపేతం చేయనున్నారు.












Click it and Unblock the Notifications