రూ.10 లక్షల పెట్టుబడితో రూ.10 కోట్లు.. థియేటర్లలో 4 ఏళ్లు ఆడిన సినిమా
సరిగ్గా 1981లో దక్షిణాది నుంచి వెళ్లిన ఒక ప్రాంతీయ హీరో, ఎటువంటి అంచనాలు లేని ఒక చిన్న సినిమాతో బాలీవుడ్ సామ్రాజ్యాన్ని శాసించాడు. ముంబై డిస్ట్రిబ్యూటర్లు కనీసం ఆ సినిమాను కొనగోలు చేయడానికి కూడా ఆసక్తి చూపించలేదు. కానీ థియేటర్లలోకి వచ్చాక హిందీ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. విశ్వనటుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు కె. బాలచందర్ కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ ప్రేమకథ 'ఏక్ దూజే కేలియే'. నార్త్ బాక్సాఫీస్ పై సౌత్ సినిమా చేసిన మొదటి అతిపెద్ద దండయాత్ర ఇది.
థియేటర్లలో నాలుగేళ్ల జాతర.. లాభాల సునామీ!
ఈ సినిమా సాధించిన లెక్కలు చూస్తే ఇప్పటికీ నమ్మశక్యం కాదు. కేవలం రూ. 10 లక్షల బడ్జెట్‌తో చాలా సింపుల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం, ఏకంగా రూ. 10 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ ట్రేడ్ వర్గాల మైండ్ బ్లాక్ చేసింది. సినిమా క్రేజ్ ఎంతలా పెరిగిపోయిందంటే.. కొన్ని థియేటర్లలో ఈ మూవీ ఏకంగా నాలుగేళ్ల పాటు నాన్‌స్టాప్‌గా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. కమల్ హాసన్, రతి అగ్నిహోత్రిల మధ్య కెమిస్ట్రీ, లక్ష్మీకాంత్-ప్యారేలాల్ అందించిన సంగీతం అప్పట్లో యువతను పిచ్చెక్కించాయి. అయితే, సినిమా క్లైమాక్స్‌లో ప్రేమికులిద్దరూ చనిపోవడం ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై నటుడు రాకేష్ బేడి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలను పంచుకున్నారు.

నిన్ను చంపేస్తాం.. విలన్‌కు వచ్చిన బెదిరింపు లేఖలు!
"సినిమా చివర్లో హీరో హీరోయిన్లు చనిపోవడాన్ని థియేటర్లలో జనాలు తట్టుకోలేకపోయారు. క్లైమాక్స్ మార్చాల్సిందేనని, వారిద్దరినీ బతికించి ఒకటి చేయాలని దేశవ్యాప్తంగా థియేటర్ల ముందు ప్రేక్షకులు గొడవలకు దిగారు" అని రాకేష్ బేడి తెలిపారు. ఈ ప్రేమకథ విషాదాంతం కావడానికి కారణమైన నెగెటివ్ పాత్రను రాకేష్ బేడి పోషించడంతో, ప్రేక్షకులు ఆ పాత్రను నిజమని నమ్మేసి ఆయనపై పగ పెంచుకున్నారు. "ఆ ఇద్దరు చావడానికి నువ్వే కారణం.. నిన్ను వదిలిపెట్టం, చంపేస్తాం" అంటూ అప్పట్లో తనకు రక్తాక్షరాలతో బెదిరింపు లేఖలు వచ్చేవని, బయట తిరగడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చిందని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రేక్షకుల గుండెలను అంతలా పిండేసిన 'ఏక్ దూజే కేలియే' చిత్రం, బాలీవుడ్‌లో కమల్ హాసన్‌ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేసింది. భారతీయ సినిమా చరిత్రలో విషాద ప్రేమకథలకు ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిన ఈ చిత్రం, ఎప్పటికీ ఒక అద్భుత కావ్యంగా నిలిచిపోతుంది












Click it and Unblock the Notifications