హొంబలే ఫిల్మ్స్ లక్కీ ఛాన్స్
కేజీఎఫ్, కాంతారా, సలార్ వంటి భారీ విజయాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మరో బిగ్ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది. మలయాళంలో తెరకెక్కిన ఓ పాన్ ఇండియా మూవీ పంపిణీ హక్కులను రికార్డు ధరకు కొనుగోలు చేసింది. పాల్ జార్జ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించింది. ఆంథోనీ వర్గీస్ పెపే ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మేలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మార్కో వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిందీ క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్. ఆంథోనీ వర్గీస్ తో నిర్మించిన కాట్టాలాన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిందీ హైలీ వయోలెంట్ మూవీ. ఈ సినిమా కర్ణాటక పంపిణీ హక్కులను హోంబలే ఫిల్మ్స్ కొనుగోలు చేసింది. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఏనుగులతో పోరాట ఘట్టాలను వీఎఫ్ఎక్స్ లేకుండా చిత్రీకరించారు. నిజమైన ఏనుగులతో సాహసోపేతంగా చిత్రీకరించారు.

థాయ్ లాండ్ మూవీ ఓంగ్ బాక్ లో కీలక పాత్రలో కనిపించిన ఏనుగు పాంగ్ కూడా ఈ చిత్రంలో భాగం అయింది. బాహుబలి 2, జవాన్ చిత్రాలకు పనిచేసిన అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ కెచా ఖంఫక్డీ పర్యవేక్షణలో థాయ్‌లాండ్‌లో ఈ సన్నివేశాలు షూట్ చేశారు. కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2కు పని చేసిన రవి బస్రూర్.. కాట్టాలన్ కు థీమ్ మ్యూజిక్ అందించారు. క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి పని చేయడం రవి బస్రూర్ కు ఇది రెండోసారి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. నిహాల్ సాదిక్ ఓ ప్రోమో ట్రాక్‌ను అందించారు. '
ఇప్పటికే విడుదలైన మజాకో మల్లిక లిరికల్ వీడియో వైరల్‌గా అయింది. కట్టాలన్ పై భారీ హైప్‌ను సృష్టించింది. తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దుషారా విజయన్ కథానాయికగా నటిస్తున్నారు. ఆంథోనీ వర్గీస్ తో పాటు సునీల్, కబీర్ దుహన్ సింగ్, జగదీష్, సిద్ధిక్, అన్సన్ పాల్, ర్యాపర్ బేబీ జీన్, లోకా ఫేమ్ షిబిన్ ఎస్ రాఘవ్ వంటి పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలను పోషించారు.
పాల్ జార్జ్, జోబి వర్గీస్, జెరో జాకబ్ సంయుక్తంగా ఈ సినిమా కథను అందించారు. మొత్తం 140 రోజుల సుదీర్ఘ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. టీ-సిరీస్ కాట్టాలన్ సంగీత హక్కులను సొంతం చేసుకుంది. షెమరూ డిజిటల్, శాటిలైట్ పంపిణీ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. చంద్రు సెల్వరాజ్, రెనడివ్, ఎం ఆర్ రాజకృష్ణన్, సునీల్ దాస్, కిషన్ వంటి టెక్నీషియన్లు, ఇతర సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు.












Click it and Unblock the Notifications