ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్
తొలి సినిమాతోనే పరిశ్రమ చూపు తనవైపు తిప్పుకోవడం ఒక ఎత్తు అయితే, ప్రతి సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన 'మార్క్' క్రియేట్ చేసుకోవడం మరో ఎత్తు. ఆ విలక్షణమైన ప్రయాణమే సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ ది. 'అ!' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, నేడు తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక గద్దర్ అవార్డును అందుకునే స్థాయికి ఆయన ఎదిగారు. హైదరాబాద్ మట్టిలోనే పుట్టి పెరిగిన మార్క్, చిన్నప్పటి నుంచి ఇక్కడి సంస్కృతిని, సంగీతాన్ని ఆకళింపు చేసుకున్నారు.
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే భేదం లేకుండా కేవలం కథలోని బలాన్ని నమ్మి సంగీతం అందించడం ఆయన శైలి.తాజాగా తెలంగాణ ప్రభుత్వం 'దండోరా' చిత్రానికి గానూ మార్క్ కె రాబిన్‌ను బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపిక చేసింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్, ఆత్మను కదిలించే నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. చిన్నప్పటి నుంచి ప్రజాకవి గద్దర్ పాటలను వింటూ పెరిగిన మార్క్‌కు, ఆయన పేరుతో ఏర్పాటు చేసిన తొలి పురస్కారాన్ని అందుకోవడం ఒక భావోద్వేగమైన సందర్భం. గద్దర్ పాటలు కేవలం పదాలు కావు, అవి నిప్పు కణాలు అని ఆయన తన సంతోషాన్ని పంచుకున్నారు.

మార్క్ కె రాబిన్ ప్రయాణంలో అవార్డులు కొత్తేమీ కాదు. ఆయన ప్రతిభను ప్రతి వేదిక గుర్తించింది. "8AM Metro" సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, తొలి చిత్రానికే 'బెస్ట్ మ్యూజిక్ ప్రొడ్యూసర్‌గా ఐరా అవార్డు సాధించారు.2017లో 'మళ్లీ కలుద్దాం' చిత్రానికి బెస్ట్ మ్యూజిక్ అందించినందుగానూ సైమా అవార్డు అవార్డు దక్కింది.'సూర్యకాంతం' చిత్రానికి బెస్ట్ అప్‌కమింగ్ కంపోజర్‌గా, 'మల్లేశం'లోని 'నాకు నువ్వని' పాటకు బెస్ట్ కంపోజర్‌గా అవార్డులు దక్కించుకున్నారు. నోయిడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో 'డిలి బిలీ' చిత్రానికి సైతం ప్రశంసలు అందుకున్నారు.
హిట్ సినిమాల వారధి
మార్క్ సంగీతం అందించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాకు ఆయన ది బెస్ట్ మ్యూజిక్ అందించారు.ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌ను అద్భుతంగా ఎలివేట్ చేసింది.జాంబీ రెడ్డి వంటి వినూత్నమైన కాన్సెప్ట్‌కు తన మార్క్ మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. తెలంగాణ మట్టి పరిమళాలను ప్రేక్షకులకు చూపించిన 'మల్లేశం' సినిమాకు తన సంగీతం ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు.
తన ప్రతిభను గుర్తించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలకు మార్క్ ధన్యవాదాలు తెలిపారు. తన ప్రయాణంలో అండగా నిలిచిన దర్శకుడు మురళీకాంత్, నిర్మాత రవీంద్ర బెనర్జీలకు తన విజయాన్ని అంకితం చేశారు. సుమారు 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించి, నిర్మాతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే 'ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ' మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్క్ కె రాబిన్ ప్రయాణం స్ఫూర్తిదాయకం.












Click it and Unblock the Notifications