రాజశేఖర్ వదులుకున్న ఇండస్ట్రీ హిట్లు చిరంజీవి దశనే మార్చేశాయి!!
యాంగ్రీ యంగ్ మేన్ గా కెరీర్ లో, తెలుగు సినీ పరిశ్రమలో రాజశేఖర్ దూసుకుపోతున్నారు. అటువంటి సమయంలో ఆయన దగ్గరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ అప్పటికి తనకున్న ఇమేజ్ పరంగా చేయాలా? వద్దా? అనే డైలామాలో వదులుకున్నారు. కానీ అవి చేసిన హీరోలంతా ఇండస్ట్రీ హిట్లు కొట్టారు. రాజశేఖర్ మాత్రం సాధారణ హిట్లతో సరిపెట్టుకున్నారు. ఒక్కోసారి టైం బాగోలేదు అంటారు ఇందుకేనేమో అనిపిస్తుంటుంది. రాజశేఖర్ వదులుకున్నవి అలాంటి, ఇలాంటి ఇండస్ట్రీ హిట్లు కాదు.. అదిరిపోయే హిట్ సినిమాలను వదులుకున్నప్పుడు మనకు కూడా అయ్యో అనిపించడం ఖాయం.
అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ వదులుకున్నారు
చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ సినిమాను వదులుకున్నారు రాజశేఖర్. ముందుగా దర్శకుడు విజయబాపినీడు ఈ కథను రాజశేఖర్ కే వినిపించారు. ఆ సమయానికి యాంగ్రీ యంగమేన్ ఆహుతి, అంకుశం లాంటి శక్తివంతమైన పాత్రలు పోషించి మంచి ఇమేజ్ లో ఉన్నారు. ఆ సమయంలో అల్లరి చిల్లరిగా తిరుగుతూ, మాస్ పాత్రలో ఉన్న గ్యాంగ్ లీడర్ పాత్ర తనకు సెట్ అవదేమో అనిపించి వద్దన్నారు. చివరకు అది చిరు దగ్గరకు చేరడం, అందులోని అంశాలు నచ్చడంతో ఓకే చెప్పారు. 1991లో విడుదలైన ఈ సినిమా అతిపెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

రాఘవేంద్రరావు తీసుకొని చిరుతో చేశారు
రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి చేసిన ఘరానామొగుడు విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ సినిమా మాతృక కన్నడ సినిమా 'అనురాగ అరళితొ' హక్కులను రాజశేఖర్ కొన్నారుకానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. ఆ కథను రాఘవేంద్రరావు తీసుకొని చిరంజీవితో చేయగా బంపర్ హిట్ అయింది. తెలుగులో మొదటి రూ. 10 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ రెండు సినిమాలతో చిరంజీవికి తిరుగులేకుండా పోయింది.
అన్నమయ్య చేస్తే బాగుండేది
కె.రాఘవేంద్రరావు అన్నమయ్య కథను కూడా రాజశేఖర్ కే వినిపించారు. అయితే అటువంటి భక్తిరస పాత్రలో ప్రేక్షకులు తనను స్వీకరిస్తారో? లేదో? అనే సందేహంతో వద్దన్నారు. నాగార్జున చేయడంతో ఆయన కెరీర్ లో కలికితురాయిగా నిలిచింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సినిమా కూడా రాజశేఖర్ చేయాల్సి ఉంది. కానీ డేట్లు అందుబాటులో లేకపోవడంతో చేయలేకపోయారు. వడ్డే నవీన్ కెరీర్ లో అతి పెద్ద హిట్ సినిమాగా పెళ్లి నిలిచింది. ఒక ఇంటర్వ్యూలో రాజశేఖర్ గ్యాంగ్ లీడర్, అన్నమయ్య, ఘరానామొగుడు లాంటివి వదులుకోవడం పొరపాటని అంగీకరించారు.












Click it and Unblock the Notifications