తెలుగు సినీ పరిశ్రమ వారిద్దరి వల్లే నాశనం అవుతోందా?
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంటే మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లేది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి సూపర్ స్టార్ కృష్ణ వరకు.. అగ్ర కథానాయకులు ఏడాదికి 7 నుండి 10 సినిమాలు, కృష్ణ అయితే ఏకంగా 15 సినిమాలు చేసేవారు. దానివల్ల పరిశ్రమ ఎప్పుడూ కళకళలాడుతుండేది. స్టూడియోలన్నీ షూటింగులతో బిజీగా ఉండేవి. లైట్ బాయ్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ వరకు 24 విభాగాల కార్మికులకు ఏడాది పొడవునా చేతినిండా పని దొరికేది. అప్పట్లో సినిమా అంటే ఒక సమష్టి కృషి, ఒక జీవనోపాధి, ఓ ప్యాషన్, ఓ జీవితం.
కాలం మారింది, కాలంతో పాటు మనుషుల మనస్తత్వాలు కూడా మారిపోయాయి. నేడు పరిశ్రమలో 'ఎవరికి వారే యమునా తీరే' అన్న ధోరణి కనిపిస్తోంది. నైతిక విలువలు, నిబద్ధత, నిర్మాత పట్ల బాధ్యత అన్నవి కనుచూపు మేరలో లేవు. రెండేళ్లకో, మూడేళ్లకో ఒక సినిమా చేయడం, భారీ పారితోషికం అందుకోవడం, సినిమా ఫలితంతో సంబంధం లేకుండా తర్వాత ప్రాజెక్టు వైపు వెళ్ళిపోవడం నేటి 'పెద్ద మనుషుల' నైజంగా మారింది. వెండితెరపై వీరోచిత హీరోయిజం ప్రదర్శించేవారు, నిజజీవితంలోకి వచ్చేసరికి కేవలం తమ స్వార్థం, తమ డబ్బు తప్ప మరేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

ఒకప్పుడు బి.ఎన్. రెడ్డి, విఠలాచార్య, కమలాకర కామేశ్వరరావు వంటి దిగ్గజ దర్శకులు ఎటువంటి కంప్యూటర్ గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ లేని రోజుల్లోనే అద్భుత దృశ్యాలను చిటికెన వేలి కొసపై సృష్టించేవారు. కానీ నేటి దర్శకులు ఒక్క షాట్ తీయడానికి గంటల తరబడి సమయం తీసుకుంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ పేరుతో నెలలు, ఏళ్ల తరబడి సమయాన్ని కరిగించేస్తున్నారు. మన నటులకు నటన రాకనా? లేక దర్శకులకు స్పష్టత లేకనా? అన్న సందేహం కలుగుతోంది. ఈ జాప్యం వల్ల నిర్మాత పెట్టే పెట్టుబడి, దానిపై పెరిగే వడ్డీ హిమాలయ పర్వతమంతై అతడిని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి.
నేడు హీరోలు దర్శకులకు, దర్శకులు హీరోలకు 'తందానా' అంటూ నిర్మాతలను బలిపశువులను చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమను తాము అమరశిల్పి జక్కన్నలుగా ఊహించుకుంటున్నారు కానీ, శిల్పం చెక్కడం కంటే దానిని సజీవ ప్రతిమలా సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ముఖ్యమనే నిజాన్ని మర్చిపోతున్నారు. హీరోలు, దర్శకుల ఈ వైఖరి ఇలాగే కొనసాగితే, తెలుగు సినీ పరిశ్రమ అథఃపాతాళానికి పడిపోవడానికి ఎంతో కాలం పట్టదని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అగ్ర తారలు తమ బాధ్యతను గుర్తించకపోతే, పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది.












Click it and Unblock the Notifications