ఎన్టీఆర్ డైరెక్షన్‌లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా
సినిమా రంగం ఎప్పుడు, ఏ రకమైన కాంబినేషన్లు కుదురుతాయో, ఎవరు ఎవరితో సినిమాలు చేస్తారో అంతుపట్టదు. అనూహ్యంగా, అకస్మాత్తుగా ఒక ప్రకటన విడులవుతుంది. అది చూసి సినీ ప్రియులంతా ఆశ్చర్యపోతారు. మెగాస్టార్ చిరంజీవి తన సినీ ప్రస్థానం మొదలుపెట్టిన కొత్తలో నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి దిగ్గజాలతో నటించే అవకాశం వచ్చినా వెనుకాడకుండా నటించారు. ఎందుకంటే అటువంటి దిగ్గజాలతో మళ్లీ మళ్లీ అవకాశాలు రావనే విషయం తెలుసు. ఆ క్రమంలోనే దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'తిరుగులేని మనిషి'లో చిరంజీవి ఒక కీలకమైన పాత్రలో మెరిశారు. ఒకరకంగా రెండో కథానాయకుడు అని చెప్పొచ్చు.
ఊహించని పరిణామం ఎదురైంది
ఈ సినిమా నాలుగో షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఊహించని పరిణామం ఎదురైంది. దర్శకుడు రాఘవేంద్రరావు తీవ్ర అనారోగ్యం పాలవడంతో వైద్యులు ఆయనను 7 రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. షూటింగ్ నిలిచిపోతే ఆర్టిస్టుల డేట్లు వృధా అవుతాయని భావించిన ఎన్టీఆర్, స్వయంగా ఆ వారం రోజులు తానే డైరెక్షన్ చేశారు. దర్శకుడిగా తనకున్న అపార అనుభవంతో మెగాఫోన్ పట్టారు. రామారావు దర్శకత్వంలో చిరంజీవి నటించడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా సినీ విశ్లేషకులు అభివర్ణిస్తారు. ముఖ్యంగా విలన్ కైకాల సత్యనారాయణతో చిరంజీవి తలపడే ఒక భారీ పోరాట ఘట్టాన్ని ఎన్టీఆర్ స్వయంగా పర్యవేక్షించి, చిత్రీకరించారు. ఒక మాస్ లెజెండ్ డైరెక్షన్‌లో కాబోయే మెగాస్టార్ చేసిన ఆ ఫైట్ సీన్ థియేటర్లలో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ఆ రకంగా నందమూరి తారకరామారావు దర్శకత్వంలో చిరంజీవి నటించినట్లైంది.

దర్శకత్వం అంటే వెన్నతో పెట్టిన విద్య
దర్శకత్వం అనేది ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. 'దాన వీర సూర కర్ణ', 'సీతారామ కల్యాణం' "గుళేబకావలి కథ", "కుల గౌరవం", "తాతమ్మ కల", "వరకట్నం", "చాణక్య చంద్రగుప్త", "శ్రీ రామ పట్టాభిషేకం" వంటి అద్భుతాలను సృష్టించారు. అటువంటి దిగ్గజుడికి రాఘవేంద్రరావు లేని లోటును భర్తీ చేయడం పెద్ద కష్టమేమీ కాలేదు. తన తోటి నటుడు చిరంజీవిలోని ప్రతిభను గుర్తించి, ఆ సన్నివేశాలను అద్భుతంగా మలిచారు. ఈ విధంగా 'తిరుగులేని మనిషి' కేవలం ఒక సినిమాగా కాకుండా, ఇద్దరు స్టార్ల మధ్య ఉన్న అనుబంధానికి, గౌరవానికి ఒక నిదర్శనంగా నిలిచిపోయింది. ఎన్టీఆర్ తో కలిసి మెగాస్టార్ నటించిన ఏకైక సినిమాగా రికార్డులకెక్కింది.












Click it and Unblock the Notifications