అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్న మెగా హీరో.. ఈసారైనా హిట్ కొట్టేనా !
"ముకుంద" సినిమాతో టాలీవుడ్ కి హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు మెగా హీరో వరుణ్ తేజ్. తొలి నుంచే విభిన్న కథలు, కొత్త జానర్లతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. ఫిదా, గద్దలకొండ గణేష్ వంటి సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. ప్రయోగాలకు వెనుకాడని హీరోగా గుర్తింపు పొందారు. అయితే ఇటీవల వరుస పరాజయాలు ఎదురవ్వడంతో వరుణ్ తేజ్ కెరీర్‌పై ఒత్తిడి పెరిగినట్లు హాట్ టాపిక్ నడుస్తోంది.
బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు రాకపోవడంతో పాటు, మార్కెట్ కూడా కొంత మేర తగ్గిన పరిస్థితుల్లో వరుణ్ తేజ్ ఇప్పుడు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు ఒక బలమైన కమర్షియల్ హిట్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కోలీవుడ్ అగ్ర దర్శకుడు అట్లీతో కలిసి వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నారనే ప్రచారం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. ఈ కాంబినేషన్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇది నిజమైతే, వరుణ్ తేజ్ కెరీర్‌కు గేమ్‌చేంజర్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

'మెర్సల్', 'బిగిల్', 'తేరి' వంటి హిట్లతో తమిళనాట అగ్ర దర్శకుడిగా నిలిచిన అట్లీ, ఇటీవల షారుఖ్ ఖాన్‌తో తెరకెక్కించిన 'జవాన్' ద్వారా పాన్-ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. ప్రస్తుతం ఆయన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో భారీ బడ్జెట్ పాన్-ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలతో రూపొందుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ పూర్తైన తర్వాతే అట్లీ, వరుణ్ తేజ్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అంతే కాకుండా వరుణ్ తేజ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఒక పవర్‌ఫుల్ కమర్షియల్ యాక్షన్ కథను ఇప్పటికే సిద్ధం చేశారని ప్రచారం జరుగుతోంది.
వరుణ్ తేజ్ ప్రస్తుతం దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న 'కొరియన్ కనకరాజు' అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. కొరియా నేపథ్యంతో రూపొందుతున్న తొలి తెలుగు సినిమాగా ఇది ప్రత్యేకత సంతరించుకుంటోంది. ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కొరియన్ పోలీస్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్, థమన్ అందించిన పవర్‌ఫుల్ నేపథ్య సంగీతం, వరుణ్ తేజ్ కనిపించిన వైలెంట్ అండ్ ఇంటెన్స్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ చిత్రంలో ఆయన పాత్ర గత సినిమాల కంటే భిన్నంగా, డార్క్ షేడ్స్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్ మేళవింపుగా ఉండబోతోందని సమాచారం.
'గద్దలకొండ గణేష్' తర్వాత పూర్తిస్థాయి కమర్షియల్ జోన్‌లోకి మళ్లీ అడుగుపెడుతున్న వరుణ్ తేజ్‌కు 'కొరియన్ కనకరాజు' నిజంగా కంబ్యాక్ మూవీ అవుతుందా? అన్న ఆసక్తి మెగా అభిమానుల్లో నెలకొంది. ఈ సినిమా విజయం సాధిస్తే, వరుణ్ తేజ్ కెరీర్‌కు మళ్లీ కొత్త ఊపిరి వచ్చే అవకాశముందని వారు విశ్వసిస్తున్నారు.












Click it and Unblock the Notifications