డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ..
తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నెల 18వ తేది నుంచి రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ డీఎస్సీ పరీక్షలు ముగిసిన తర్వాత మరో డీఎస్సీ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో డీఎస్సీ పరీక్షలపై తాజా అప్‌డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డీఎస్సీ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఏటా రెండుసార్లు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తామని, వాటిని జూన్‌లో ఒకసారి, డిసెంబరులో మరోసారి నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ జీఓ జారీచేసిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం చూసుకుంటే ఇక, ఈ ఏడాది డిసెంబరులో టెట్ ఉండనుంది. టెట్ పరీక్ష ముగిసాక డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చినా 45 రోజుల గడువు తప్పనిసరిగా ఉంటుంది. ఈ లెక్కన మరో డీఎస్సీ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

ఎల్లుండి నుంచి డీఎస్సీ పరీక్షలు..
తెలంగాణ రాష్ట్రంలో గతంలో 11,062 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలు ఎల్లుండి (జులై 18) నుంచి ఆగస్టు 5వరక జరగనున్నాయి. మొత్తం 2.79 లక్షల మంది ఈ పరీక్షలు రాయనున్నారు. ప్రతి రోజూ రెండు షిప్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. రోజూ 26వేలమందికి చొప్పున పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు విద్యాశాఖ తెలిపింది. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
ఇక, సోమవారం నాటికి 2,20,000 మంది తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. మిగతా అభ్యర్థులు సైతం హాల్‌టిక్కెట్లు వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కోరింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా, 50 వేలకు పైగా అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ వెబ్‌సైట్‌ను schooledu.telangana.gov.in సంప్రదించగలరు.












Click it and Unblock the Notifications