Jobs: 25 లక్షల కొత్త ఉద్యోగాలు! కొలువుల జాతరే ఇక
భారతీయ నిరుద్యోగులకు, ముఖ్యంగా వైద్య - ఔషధ రంగాల్లో కెరీర్ నిర్మించుకోవాలనుకునే వారికి ఒక అద్భుతమైన శుభవార్త. రాబోయే నాలుగేళ్లలో దేశీయ హెల్త్‌కేర్- ఫార్మా రంగాలు ఉపాధి గనులుగా మారబోతున్నాయి. ప్రముఖ గ్లోబల్ ఎంప్లాయ్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ 'అడెక్కో ఇండియా' (Adecco India) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2030 నాటికి ఈ రంగాల్లో ఏకంగా 20 నుంచి 25 లక్షల కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్య సంరక్షణ (Health Care), ఔషధ రంగాలు (Pharma) అత్యంత కీలక దశలోకి ప్రవేశిస్తున్నాయి. ప్రస్తుతం దేశ జీడీపీలో 3.3 శాతంగా ఉన్న ఈ రంగాల వాటా, 2030 నాటికి 5 శాతానికి చేరుకోనుందని అడెక్కో ఇండియా అంచనా వేసింది. అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా తయారీ మరియు క్లినికల్ రీసెర్చ్ కార్యకలాపాలు భారత్‌కు అవుట్‌సోర్సింగ్ అవుతుండటమే దీనికి ప్రధాన కారణం.

ఏయే విభాగాల్లో అవకాశాలు ఎక్కువ?
కేవలం ఆసుపత్రులే కాకుండా, విభిన్న విభాగాల్లో నియామకాలు జోరందుకోనున్నాయి:
- ముఖ్య రంగాలు: ఆయుష్ (AYUSH), వృద్ధుల సంరక్షణ (Elderly Care), డయాగ్నొస్టిక్స్, టెలిమెడిసిన్, లైఫ్ సైన్సెస్ మరియు పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్.
- టెక్నాలజీ మేళవింపు: స్పెషలైజేషన్ మరియు అత్యాధునిక టెక్నాలజీ నైపుణ్యాలు ఉన్నవారికి కంపెనీలు పెద్దపీట వేయనున్నాయి.
- పరిశోధనలు: ఆర్ అండ్ డీ (R&D), రెగ్యులేటరీ విభాగాల్లో నియామకాలు 25-30% పెరిగే అవకాశం ఉంది.
- నైపుణ్యం ఉంటేనే మనుగడ: స్కిల్స్ రీ-లెర్నింగ్ తప్పనిసరి
నివేదిక ప్రకారం, ప్రస్తుతం పని చేస్తున్న కార్మిక శక్తిలో దాదాపు 30-35 శాతం మందికి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం (Upskilling/Reskilling) అత్యవసరం. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోకపోతే అవకాశాలు అందుకోవడం కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్.. ఉద్యోగాల అడ్డా!
దేశవ్యాప్తంగా జరిగే నియామకాల్లో 65-70% వాటా ప్రధాన నగరాలదే కానుంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై మరియు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాలు నియామకాలకు ప్రధాన కేంద్రాలుగా నిలుస్తాయి. వీటితో పాటు పుణె, అహ్మదాబాద్, కోయంబత్తూర్ వంటి నగరాల్లో కూడా ఆసుపత్రి నెట్‌వర్క్‌లు, మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు వేగంగా విస్తరిస్తున్నాయి.
రెండో, మూడో అంచె పట్టణాలకూ విస్తరణ..
డయాగ్నొస్టిక్స్- ప్రివెంటివ్ హెల్త్‌కేర్ సేవలు ఇప్పుడు చిన్న పట్టణాలకూ విస్తరిస్తున్నాయి. దీనివల్ల ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో హెల్త్‌కేర్ సేవల డిమాండ్ 20-25% పెరుగుతుందని అడెక్కో ఇండియా అసోసియేట్ డైరెక్టర్ పీయుష్ సప్రూ తెలిపారు.
మొత్తానికి, రాబోయే కాలంలో టెక్నాలజీతో కూడిన వైద్య విద్య - ఫార్మా కోర్సులు చేసిన యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉండబోతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.












Click it and Unblock the Notifications