నీట్ యూజీ పరీక్ష - 2026 రూల్స్ ఇవే.. ఫాలో కాకుంటే నో ఎంట్రీ!
దేశవ్యాప్తంగా వైద్య విద్య అభ్యసించాలని కలలుగంటున్న లక్షలాది మంది విద్యార్థుల కోసం అత్యంత కీలకమైన నీట్-యూజీ 2026 పరీక్షకు సమయం దగ్గరపడుతోంది. మే 3న దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ (పెన్-అండ్-పేపర్) విధానంలో ఈ పరీక్ష నిర్వహించనుంది. ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ విడుదల చేసి అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని పెంచింది. త్వరలోనే అడ్మిట్ కార్డులు కూడా అందుబాటులోకి రానున్నాయి.
ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ వంటి వైద్య కోర్సుల్లో ప్రవేశాలు లభించనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీటు సాధించాలంటే నీట్‌లో మంచి ర్యాంక్ తప్పనిసరి కావడంతో, ప్రతి చిన్న నియమాన్ని పాటించడం విద్యార్థులకు అత్యంత అవసరం.

పరీక్షా రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎన్టీఏ స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందుగానే చేరుకోవాలి. ఆలస్యంగా వచ్చిన వారికి ప్రవేశం నిరాకరించే అవకాశం ఉంది. అడ్మిట్ కార్డు తప్పనిసరిగా తీసుకురావడంతో పాటు, ఏదైనా ఒరిజినల్ ఫోటో ఐడీ ప్రూఫ్ కూడా వెంట ఉండాలి. ఇవి లేకపోతే పరీక్ష రాయడానికి అనుమతి ఉండదు.
రూల్స్ ఇవే..
- పరీక్షా కేంద్రానికి కనీసం గంట ముందుగానే చేరుకోవాలి
- అడ్మిట్ కార్డు తప్పనిసరి, దానితో పాటు ఒక ఒరిజినల్ ఫోటో ఐడీ ప్రూఫ్ తీసుకురావాలి
- ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు ఎంట్రీ నిరాకరణ ఉండొచ్చు
- బ్లాక్/బ్లూ బాల్‌పాయింట్ పెన్‌తోనే ఓఎంఆర్ షీట్ నింపాలి
- కరెక్షన్ ఫ్లూయిడ్, ఓవర్రైటింగ్ పూర్తిగా నిషేధం
- డ్రెస్ కోడ్ కఠినంగా పాటించాలి - పొడవు చేతులున్న దుస్తులు, భారీ బట్టలు ధరించరాదు
- మెటల్ నగలు, గడియారం, బెల్ట్, క్యాప్ వంటి వస్తువులు అనుమతి లేదు
- సెల్‌ఫోన్, బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్, కాలిక్యులేటర్, పెన్ డ్రైవ్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధం
- జామెట్రీ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, వాలెట్ కూడా అనుమతించబడవు
- సంప్రదాయ దుస్తులు ధరించే వారు ముందుగానే కేంద్రానికి చేరుకుని అధికారులకు తెలియజేయాలి
- పరీక్ష సమయంలో నిశ్శబ్దంగా, నియమాలు పాటిస్తూ ఉండాలి
- ఓఎంఆర్ షీట్ నింపిన తర్వాత చివరిలో ఒకసారి చెక్ చేయడం తప్పనిసరి
ఈ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా మాత్రమే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షను పూర్తి చేయగలరు. సరైన ప్రణాళిక, సమయపాలన, ప్రశాంతతతో పరీక్షను ఎదుర్కొంటే మంచి ఫలితాలు సాధించడం సాధ్యమే.












Click it and Unblock the Notifications