రేపటినుంచి వెబ్‌సైట్‌లో తెలంగాణ డీఎస్సీ హాల్‌టిక్కెట్లు...
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 18వ తేది నుంచి వచ్చే నెల 5వ తేదివరకు ఆన్‌లైన్‌లో జరిగే డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టిక్కెట్లు రేపటి (గురువారం) నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తెలంగాణ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోగలరని పాఠశాల విద్యాశాఖ తెలిపింది.
రాష్ట్రంలో మొత్తం 11,062 డీఎస్సీ పోస్టులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి మార్చి 4 నుంచి జూన్ 20 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం ఖాళీల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 6,508 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉన్నాయి.

లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 727, పీఈటీలు పోస్టులు 182 ఉన్నాయి. ప్రత్యేక కేటగిరీ విభాగంలో స్కూల్ అసిస్టెంట్లు 220 పోస్టులు, ఎస్జీటీలు 796 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక, ఈ పరీక్షలకు షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ గతనెల 28న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారమే జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
పరీక్షలు వాయిదాపై అభ్యర్థులు ఆందోళనలు..
డీఎస్సీ పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేసి, మొత్తం 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని అభ్యర్థులు ఓపక్క ఆందోళనలు చేస్తున్నా... తెలంగాణ విద్యాశాఖ మాత్రం ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే డీఎస్సీ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈపరీక్షలకు సంబంధించిన హాల్‌టక్కెట్లు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి...












Click it and Unblock the Notifications