వీఆర్ఏల సర్దుబాటు కోసం 14,954 పోస్టుల మంజూరు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ సహాయకులు(VRA)ల సర్దుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పోస్టులు మంజూరు చేసింది. ప్రభుత్వ విభాగాల్లోని వివిధ శాఖల్లో వీఆర్ఏల సర్దుబాటు కోసం 14,954 పోస్టులను మంజూరు చేసింది. రెవెన్యూ శాఖలో 2451 జూనియర్ అసిస్టెంట్, 2113 రికార్డ్ అసిస్టెంట్, 679 సబార్డినేట్ పోస్టులు మంజూరు చేసింది.
మిషన్ భగీరథ శాఖలో 3372 హెల్పర్ పోస్టులు, నీటి పారుదల శాఖలో 5063 లష్కర్, హెల్పర్ పోస్టులు, మున్సిపల్ శాఖలో 1266 వార్డు ఆఫీసర్ పోస్టులు కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్ఏల విద్యార్హతలు, సామర్థ్యాల ఆధారంగా వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

వీఆర్ఏల సేవలు విస్తృతంగా వినియోగించుకోవాలని, వారి అభిప్రాయల మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వీఆర్ఏల సర్దుబాటుపై మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఉప సంఘం వీఆర్ఏలతో చర్చించి, వారి అభిప్రాయాలు తీసుకుంది. చర్చల అనంతరం ఉప సంఘం సూచనల మేరకు వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు మంజూరు చేసింది.
ఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఆర్డీవోలు
ప్రభుత్వ ఆస్పత్రుల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)లను నియమించనున్నట్లు ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం ప్రతి ఏరియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్ వ్యవస్థ ఉందని.. వారిపై పర్యవేక్షణకు ఆర్డీవోలను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా నియమించనున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications