నేడు టిఎస్ పాలీసెట్ 2024 ఫలితాలు విడుదల..
నేడు (సోమవారం) తెలంగాణ పాలీసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. జూన్ 3వ తేది (నేటి ) మధ్యాహ్నం 12 గంటలకు టిఎస్ పాలిసెట్ 2024 ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్ పరీక్షను గతనెల 24వ తేదీన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 92,808 విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. అందులో 82,809 (89.23శాతం) విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పాలిసెట్ ఫలితాలు, ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్ వంటి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది. మే నెలలో జరిగిన ఈ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను నేడు చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ విద్యాశాఖ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే నేడు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక ఇప్పటికే తెలంగాణ పాలిసెట్ - 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఈనెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ఈ నెల 22వ తేదీ నుంచి ఇచ్చుకునే అవకాశం కల్పించగా, ఈ నెల 30వ తేదీన పాలీసెట్ సీట్ల కేటాయింపు ఉంటుంది. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూలై 7వ తేదీ నుంచి మొదలు కానుంది. జులై 13వ తేదీన టీఎస్ పాలీసెట్ సీట్లను కేటాయించనున్నారు. జూలై 23వ తేదీన స్పాట్ ఆడ్మిషన్లకు గైడ్ లైన్స్ విడుదల కానున్నాయి. జూలై 24వ తేదీలోపు తెలంగాణ పాలీసెట్ ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.













Click it and Unblock the Notifications