తెలంగాణ ఏఈ, జేటీవో హాల్ టికెట్లు అందుబాటులోకి, పరీక్ష తేదీలివే
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ క్రమంలో కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షకు హాల్ టికెట్లు మరో రెండు రోజుల్లో అందుబాటులో ఉండనున్నాయి.
హాల్ టికెట్లను అక్టోబర్ 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్షలు అక్టోబర్ 18, 19, 20వ తేదీల్లో రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి.
Group-2: తెలంగాణ గ్రూప్-2 మరోసారి వాయిదా, కొత్త తేదీలివే

తెలంగాణ గ్రూప్-2 (Group-2) పరీక్ష మరోసారి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం నవంబర్ 2, 3న గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరీక్షను రీషెడ్యూల్ చేశారు. గ్రూప్-2 పరీక్షను వచ్చే ఏడాది(2024) జనవరి 6,7 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఓ ప్రకటనలో వెల్లడించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో గ్రూప్-2 పరీక్ష వాయిదా, కొత్త తేదీల ఖరారుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రూప్-2 పరీక్ష వాయిదా పడటం ఇది రెండోసారి కావడం గమనార్హం. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.
మొదట విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్ష జరగాల్సి ఉన్నప్పటికీ.. అప్పుడు వరుసగా ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు, రాజకీయ పార్టీల నేతలు ఆందోళనలకు దిగారు. దీంతో ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. అప్పుడు నవంబర్ 2,3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అయితే, తాజాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పరీక్ష నిర్వహణ క్లిష్టతరమయ్యే అవకాశం ఉండటంతో మరోసారి వాయిదా వేయాలని నిర్ణయించారు అధికారులు. దీంతో గ్రూప్-2 అభ్యర్థులు పరీక్ష రాసేందుకు వచ్చే ఏడాది జనవరి 6,7 వరకు ఎదురుచూడక తప్పదు. అయితే, పరీక్షకు చాలా సమయం ఉండటంతో అభ్యర్థులు పరీక్షకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేందుకు సమయం దొరుతుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications