నేను ఏ తప్పు చేయలేదు.. కనకదుర్గమ్మే అండ - నటి హేమ
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు దగ్గరైంది నటి హేమ. ఆమె అసలు పేరు కృష్ణవేణి కాగా స్వస్థలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు. సినిమాలపై ఉన్న మక్కువతో పరిశ్రమలోకి అడుగుపెట్టిన హేమ.. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 500కి పైగా చిత్రాల్లో నటించింది. సీరియల్స్‌లో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.
హేమ సినీ ప్రస్థానం..
1989లో 'చిన్నారి స్నేహం' సినిమాలో చిన్న పాత్రతో హేమ సినీ కెరీర్ ప్రారంభించింది. ఆమె నటించిన చిత్రాల్లో అతడు, దేశముదురు, పెళ్లైన కొత్తలో, శ్రీరామదాసు, భగీరథ, మల్లీశ్వరి వంటి సినిమాలు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. సినిమాలతో పాటు బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్‌గా కూడా పాల్గొంది హేమ . అయితే తొలివారంలోనే ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. చివరిగా ఆమె 2023లో విడుదలైన 'ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు' చిత్రంలో కనిపించింది. అయితే ఇటీవల కాలంలో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయ్యి వార్తల్లో నిలిచింది.

ఇంద్రకీలాద్రిపై కన్నీటి పర్యంతం..
ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు హేమ. అమ్మవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీటిపర్యంతమయ్యారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మవారి దర్శనానికి వచ్చానని.. అయితే ఈ సంవత్సరం పర్యటనకు ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు. గత ఏడాది మీరందరూ నాపై వేసిన నీలాపనిందలను ఈ దుర్గమ్మే తుడిచిపెట్టింది. నేను చేయని తప్పుకు మీరందరూ నన్ను బలిచేశారు. ప్రతిక్షణం అమ్మవారే నాకు అండగా నిలిచి, కొండంత ధైర్యాన్నిచ్చారని చెప్పుకొచ్చారు.
నేనున్నాను, నువ్వు ముందుకెళ్లు' అని నన్ను బతికిచ్చారు" అంటూ ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులను మర్చిపోలేనని అన్నారు. ఈ సందర్భంగా హేమ మీడియా ప్రతినిధులకు ఒక విజ్ఞప్తి చేశారు. "దయచేసి ఏదైనా వార్త ప్రచురించే ముందు నిజానిజాలు పూర్తిగా తెలుసుకోండి. ఈరోజు నేను గుడిలో ఉండి చెబుతున్నాను.. నేను ఆ తప్పు చేయలేదు" అని ఆమె మరోసారి స్పష్టం చేశారు.
ఇక కొన్ని నెలల క్రితం బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నారని బెంగళూరు పోలీసులు ప్రకటించడం అప్పట్లో టాలీవుడ్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. డ్రగ్స్ తీసుకున్నట్లు పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పోలీసులు పేర్కొన్నారు. దాంతో ఆ కేసులో పోలీసులు హేమకు నోటీసులు జారీ చేసి.. విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు ఈ కేసుపై స్టే విధించడంతో ఆమెకు తాత్కాలికంగా ఊరట లభించింది. ఈ ఇష్యూ జరిగినప్పటి నుంచి హేమ సినిమాలకు బ్రేక్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications