తెల్లారితే పెళ్లి.. కానీ ఆ ముందు రోజు రాత్రి కూడా ఆ పని చేశా..
దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన శైలితో చిరస్థాయిగా నిలిచిపోయిన అగ్ర నటి రమ్యకృష్ణ. నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న ఆమె సినీ ప్రయాణంలో 260కి పైగా చిత్రాలలో నటించి సత్తా చాటారు. 1970 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించిన ఆమె.. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్నారు. ముఖ్యంగా భరతనాట్యంలో శిక్షణ పొందిన ఆమె, స్టేజ్ ప్రదర్శనలతో తన ప్రతిభను చాటుకున్నారు. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి.. 1984లో తమిళ చిత్రం 'వెలైకారన్' ద్వారా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ తర్వాత తెలుగులో 'భలే మిత్రులు' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మొదట్లో చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, క్రమంగా ప్రధాన నాయిక స్థాయికి ఎదిగింది. 1980ల చివరి దశ నుంచి 1990ల కాలంలో రమ్యకృష్ణ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవి వంటి అగ్రహీరోల సరసన అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. కాగా తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే కాకుండా కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలోనూ నటించి పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు.

ఒకవైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే.. మరోవైపు గంభీరమైన, శక్తివంతమైన పాత్రలను సైతం సమర్థంగా పోషించారు. 'నరసింహా' చిత్రంలో చేసిన నెగటివ్ షేడ్ పాత్ర కూడా ఆమె నటనా ప్రతిభను మరో స్థాయికి తీసుకెళ్లింది. కాలానుగుణంగా పాత్రలను మార్చుకుంటూ, రమ్యకృష్ణ హీరోయిన్‌గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఇక 'బాహుబలి' చిత్రంలో శివగామి పాత్ర ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఆ పాత్ర ద్వారా ఆమెకు దేశవ్యాప్తంగా అపారమైన గుర్తింపు లభించింది. అయితే స్పెషల్ సాంగ్స్‌లోనూ ఆమె తన స్టైల్‌ను కొనసాగిస్తూ కొత్త తరానికి కూడా దగ్గరయ్యారు.
తెల్లారితే పెళ్లి..
కాగా దర్శకుడు కృష్ణవంశీని రమ్యకృష్ణ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వారి 2003లో వీరి పెళ్లి సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను రమ్యకృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'సింహాద్రి' చిత్రంలోని "చిన్నది అమ్మే చీకులు కావాలా" పాటలో స్టెప్పులు వేసి అదరగొట్టారు. కానీ ఆ సాంగ్ షూటింగ్ పెళ్లి రోజు ముందు రాత్రి కూడా చేసినట్టు వెల్లడించారు. రాత్రి 2 గంటల వరకు పని చేసి, ఆ తర్వాతే పెళ్లికి వెళ్లానని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.












Click it and Unblock the Notifications