ఇన్నాళ్లకు ఫేవరేట్ హీరోతో.. "కన్నడ బ్యూటీ" కోరిక తీరినట్టేనా..?
"రుక్మిణీ వసంత్".. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. 2019లో 'బీర్బల్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 2023లో వచ్చిన 'సప్త సాగరాలు దాటి' చిత్రంతో కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రంలో సహజమైన నటన, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత తెలుగులో నిఖిల్ సరసన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే చిత్రంలో నటించినా ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.
అలానే "బఘీరా", "బైరతి రంగల్", "ఏస్" చిత్రాల్లో నటించినప్పటికీ.. అవి పెద్దగా విజయం పొందలేకపోయాయి. రీసెంట్ గానే శివ కార్తికేయన్‌తో నటించిన "మదరాసి", రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన "కాంతారా: చాప్టర్ 1" సినిమాలో నటించి మెప్పించింది. భారీ హిట్ కొట్టిన ఈ మూవీలో అమ్మడు నటనకు ఫ్యాన్స్ ఫుల్ ఫీదా అవుతున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో యశ్ 'టాక్సిక్', ఎన్టీఆర్ 'డ్రాగన్'వంటి పాన్ ఇండియా సినిమాలున్నాయి. అయితే ఇప్పుడు టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆమె కల కూడా నెరవేరబోతుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది.

కాగా టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై రూపొందబోయే కొత్త సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించనున్నట్లు ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 'దండోరా' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, కథానాయిక పాత్ర కోసం రుక్మిణిని సంప్రదించగా ఆమె అంగీకారం తెలిపినట్లు సమాచారం.
గతంలో ఓ ఇంటర్వ్యూలో రుక్మిణి వసంత్ తనకు తెలుగులో అత్యంత ఇష్టమైన హీరో నాని అని ఓపెన్ అయ్యారు. నాని చేసే సినిమాల్లో ఎప్పుడూ కొత్తదనం ఉంటుందని, ప్రతి కథలో ఒక అర్థవంతమైన అంశం దాగి ఉంటుందని అన్నారు. ఆయన నటన తనకు ఎంతో ఇష్టమని అప్పట్లో వెల్లడించింది. అంతేకాకుండా తనకు అవకాశం వస్తే నానితో కలిసి పనిచేయాలని ఉందని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో హీరో ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హీరో ఖరారైన వెంటనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.
ఇక నాని నిర్మాతగా ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకున్నారు. హిట్, హిట్ 2, కోర్ట్, మీట్ క్యూట్ వంటి సినిమాలతో ప్రేక్షకుల ప్రశంసలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇప్పుడు మురళీకాంత్ దర్శకత్వం, నాని నిర్మాణం, రుక్మిణి వసంత్ వంటి క్రేజీ హీరోయిన్ అంటే.. సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications