pushpa2: 'పుష్ప2' మూవీ రివ్యూ: సుకుమార్ ఏంటి ఇలా తీశాడు?
నటీనటులు
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, రావు రమేష్, అనసూయ, సునీల్, అజయ్
దర్శకుడు: సుకుమార్
నిర్మాతలు: యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్, చెరుకూరి మోహన్
సంగీతం: దేవిశ్రీప్రసాద్, సామ్ సీఎస్(బీజీఎం)
సినిమాటోగ్రఫీ: మిరాస్లోవ్ కూబా బ్రోజెక్
పుష్ప1 ది రైజ్ సూపర్ హిట్ కావడంతోపాటు ఆ సినిమా క్లైమాక్స్ లో ఆసక్తికరమైన ముగింపును దర్శకుడు ఇస్తాడు. దీంతోపాటు హీరో పలికిన చిత్తూరు యాస, తగ్గేదేలే అనే మ్యానరిజంతోపాటు అల్లు అర్జున్ నటన... ఇలా అన్నీ కలిసి సినిమాను దక్షిణాదికన్నా ఉత్తరాదిలోనే సూపర్ హిట్ గా నిలిపాయి. అందుకు ఈ సినిమా ట్రైలర్ విడుదలను పాట్నాలో జరిపారు. మూడు సంవత్సరాల నుంచి సినీ ప్రియులు అత్యంత ఉత్కంఠగా పుష్ప2 ది రూలర్ ఎప్పుడు వస్తుందా? అంటూ ఎదురుచూశారు. వారు ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. థియేటర్లలో బొమ్మ పడింది. పుష్ప అనే పేరు ఓ బ్రాండ్ లా మారిపోయిన తరుణంలో మొదటి భాగానికి ధీటుగా రెండో భాగం ఉందా? లేదా? అనేది తెలుసుకుందాం.
కథ: భన్వర్ సింగ్ షెకావత్ తో వైరం ఉంటుందని ముందుగానే అందరికీ తెలిసిందే. శేషాచలం అడవుల్లో కూలీగా జీవితాన్ని ప్రారంభించిన పుష్ప తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర దేశాలకు విస్తరించడం ప్రారంభిస్తాడు. షెకావత్ తో వైరం పెద్దవుతుంది. తన భార్య శ్రీవల్లి మాటను మాత్రం ఇంట్లో జవదాటడు. తను భర్తను ఓ కోరిక కోరుతుంది. ముఖ్యమంత్రితో ఫొటో దిగితే చూడాలని. దీంతో ఎమ్మెల్యే రావు రమేష్ తో కలిసి ముఖ్యమంత్రి దగ్గరకు వెళితే స్మగ్లర్ తో ఫొటో దిగడానికి నిరాకరిస్తాడు. మాటలతో అవమానిస్తాడు. దీంతో రావు రమేష్ ను ముఖ్యమంత్రిని చేయాలని పుష్ప నిర్ణయించుకుంటాడు. అక్కడి నుంచి కథ ఎటువంటి మలుపులు తిరిగింది? షెకావత్ ను పుష్ప ఎలా ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ.

భార్య మాట వింటే ఏమవుతుంది?
పుష్ప పాత్ర నైజం ఎలా ఉంటుందనేది దర్శకుడు బాగా చూపించాడు. పుష్ప, షెకావత్ ఒకరిపై మరొకరు వేసుకునే ఎత్తులు, పై ఎత్తులు డ్రామాను పండిస్తాయి. ఇంటర్వెల్ కు ముందు వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. సినిమా అంతా ఒక ఎత్తయితే, అవి మరో ఎత్తు. భార్య మాటను జవదాటని భర్తగా పుష్పను చూపించాడు సుకుమార్. కుటుంబ బంధాలను జోడించాడు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనే విషయాన్ని సినిమాలో కథతో ముడిపెట్టి చూపించాడు. రెండో భాగంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్. అల్లు అర్జున్ చీర కట్టుకొని నటించి జాతీయ అవార్డుకు తాను ఎందుకు అర్హుడినయ్యానో నిరూపించాడు. ఈ సన్నివేశానికి థియేటర్లన్నీ దద్దరిల్లిపోతాయని చెప్పొచ్చు. "నాకు ఆడబిడ్డ పుట్టాలని కోరుకున్నాను" అనే సన్నివేశంలో అల్లు అర్జున్ లోని పూర్తిస్థాయి నటుడు బయటపడ్డాడు.
రూ.2వేల కోట్ల ఎర్ర చందనాన్ని దేశ సరిహద్దులు దాటించే సన్నివేశం ఆకట్టుకుంటుంది. భర్తను ఏమన్నా అంటే ఊరుకోని సగటు గృహిణి పాత్రలో రష్మిక నటన బాగుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు, కుటుంబ భావోద్వేగాలు అలరిస్తాయి. ఓ ఆసక్తికరమైన మలుపుతో దర్శకుడు సుకుమార్ పుష్ప3కి బాటలు వేశారు.
నట విశ్వరూపాన్ని చూపించాడు
పుష్ప పాత్రలో తన విశ్వరూపాన్ని అల్లు అర్జున్ చూపించాడు. కాస్త డోస్ పెంచి నటించడంతోపాటు పాటలు, ఫైట్లపై తనదైన ముద్ర వేశాడు. క్లైమాక్స్ తోపాటు జాతర సన్నివేశంలో ఆయన నటన అద్భుతంగా ఉంది. రష్మికతో కెమిస్ట్రీ బాగా కుదిరింది. శ్రీలీల కిస్సిక్ సాంగ్ తో దుమ్ము రేపిందని చెప్పొచ్చు. తన అందంతో కూడా ఎంతో ఆకట్టుకుంది. క్లైమాక్స్ లో జగపతిబాబు, తారక్ పొన్నప్ప తమ నటనతో ప్రేక్షకులను భయపెడతారని చెప్పొచ్చు.
ఎలా చేశారంటే..
అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి పుష్ప పాత్రలో ఒదిగిపోయాడు. యాస, హావభావాల విషయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించాడు. పోరాట ఘట్టాలు, డ్యాన్స్‌లపైనా మరింత ప్రభావం చూపించాడు. జాతర ఎపిసోడ్‌లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరోస్థాయిలో ఉంది. జాతీయ అవార్డు విషయంలో ఉన్న అనుమానాలను జాతర ఎపిసోడ్‌లో తన నటనతో బన్ని పటాపంచలు చేశాడు. రష్మికతో (Rashmika) కెమిస్ట్రీ బాగా కుదిరింది. పీలింగ్స్, సూసేకి పాటల్లో ఇద్దరి జోడీ, వాళ్లు కలిసి చేసిన డ్యాన్సులు మెప్పిస్తాయి. రష్మిక ఈ సినిమాతో గ్లామర్ డోస్ కూడా పెంచింది. జాతర ఎపిసోడ్‌లోనూ ఆమె నటన బాగుంది. 'కిస్సిక్' పాటతో మెరిసిన శ్రీలీల (Sreeleela) డ్యాన్స్‌తో దుమ్మురేపింది. అందంతోనూ ఆకట్టుకుంది. పుష్ప1లో కథను అల్లు అర్జున్ కు స్నేహితుడిగా నటించిన జగదీష్ తో చెప్పిస్తాడు. ఈసారి అది మిస్ అయింది. సునీల్, అనసూయ పాత్రలు సాదాసీదాగా సాగుతాయి. రెండో భాగంలో కథ లేకపోవడంతోపాటు బలమైన విలనిజం లేదు. విలన్ బలంగా ఉంటేనే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. సుకుమార్ చాలా తెలివిగా కుటుంబ భావోద్వేగాలను ఈ సినిమాలో కలిపేసి విజయం సాధించాడు. పుష్ప2కు డివైడ్ టాక్ వచ్చే అవకాశం లేదు. ఎలివేషన్లతో దర్శకుడు అభిమానుల కడుపు నింపేశాడు. దీంతోపాటు అల్లు అర్జున్ నటన ముందు ఎన్ని లోటుపాట్లు సినిమాలో ఉన్నప్పటికీ అవన్నీ కొట్టుకుపోతాయి. పుష్ప2 తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications