చిరంజీవి vs అల్లు అర్జున్: ఫిలింఫేర్ సాక్షిగా ముదురుతున్న రికార్డుల రచ్చ!
70వ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకలు ముగిసిన వెంటనే సోషల్ మీడియా వేదికగా రికార్డుల యుద్ధం మొదలైంది. ముఖ్యంగా 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకోవడంతో ఆయన మెగాస్టార్ చిరంజీవి ఆల్-టైమ్ రికార్డును సమం చేశారంటూ ప్రచారం మొదలైంది. దీంతో మెగా అభిమానులు, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మధ్య చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అయితే అసలు గణాంకాలు ఏం చెబుతున్నాయి? ఈ రికార్డుల వెనుక ఉన్ననిఖార్సైన నిజాలను లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
చెక్కుచెదరని చిరంజీవి 7 అవార్డుల బెంచ్ మార్క్
తెలుగు చిత్ర పరిశ్రమలో 'ఉత్తమ నటుడు' విభాగంలో అత్యధిక ఫిలింఫేర్ అవార్డులు సాధించిన రికార్డు ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవి పేరు మీదనే ఉంది. ఆయన తన సుదీర్ఘ కెరీర్‌లో ఏడు సార్లు 'ఉత్తమ నటుడు'గా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి అడుగుపెట్టి, చిన్న చిన్న పాత్రల నుంచి స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి ప్రయాణం ఒక అద్భుతం. ఆయన సాధించిన ఈ ఏడు అవార్డులు కేవలం ఒక విభాగంలోనే కావడం విశేషం. దశాబ్దాల పాటు పరిశ్రమను శాసించిన మెగాస్టార్ స్థాయికి ఈ రికార్డు ఒక నిదర్శనం.

అల్లు అర్జున్ ప్రయాణం.. గందరగోళానికి కారణం ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్ పరంగా అత్యున్నత దశలో ఉన్నారు. తాజా అవార్డుతో కలిపి ఆయన ఇప్పటివరకు ఐదు సార్లు (పరుగు, వేదం, రేసు గుర్రం, పుష్ప 1, పుష్ప 2) 'ఉత్తమ నటుడు' విభాగంలో ఫిలింఫేర్ అందుకున్నారు. అయితే అల్లు అర్జున్ మొత్తం ఫిలింఫేర్ ట్రోఫీల సంఖ్య (సపోర్టింగ్ యాక్టర్, క్రిటిక్స్ అవార్డులతో కలిపి) ఏడుకు చేరుకోవడంతో.. ఆయన చిరంజీవి రికార్డును సమం చేశారని కొందరు పొరపడుతున్నారు. కానీ ప్రధానమైన 'ఉత్తమ నటుడు' విభాగంలో చూస్తే, అల్లు అర్జున్ ఇంకా రెండు అవార్డుల వెనుకంజలోనే ఉన్నారన్నది కాదనలేని వాస్తవం.
పోటీలో మరో ఇద్దు 5 అవార్డుల హీరోలు
ఫిలింఫేర్ రేసులో కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా 'ఉత్తమ నటుడు' విభాగంలో 5 అవార్డులు గెలుచుకుని బన్నీతో సమానంగా రేసులో ఉన్నాడు. అలాగే సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జున కూడా పలుమార్లు ఈ అవార్డులను గెలుచుకున్నప్పటికీ, చిరంజీవి నెలకొల్పిన 'ఏడు' అవార్డుల మార్కును ఇప్పటికీ ఎవరూ దాటలేకపోయారు. అంట, ప్రస్తుత తరంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇద్దరూ మెగాస్టార్ రికార్డుకు చేరువలో ఉన్నారనే చెప్పాలి.
వారసత్వానికి.. స్వయంకృషికి మధ్య పోటీ
ఈ రికార్డుల చర్చ కేవలం అంకెలకే పరిమితం కాలేదు. చిరంజీవి ప్రయాణం శూన్యం నుంచి మొదలై సామ్రాజ్య స్థాపన వరకు సాగితే.. అల్లు అర్జున్ ఒక బలమైన సినీ నేపథ్యం నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకున్నారు. నేడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతున్నారు. అయితే చారిత్రాత్మకంగా చూస్తే, ఒక సామాన్యుడిగా వచ్చి సినీ పరిశ్రమ స్వరూపాన్నే మార్చేసిన చిరంజీవి నెలకొల్పిన ఏడు అవార్డుల రికార్డు ఇప్పటికీ అగ్రస్థానంలోనే నిలిచి ఉంది. భవిష్యత్తులో అల్లు అర్జున్ లేదా మహేష్ బాబు ఈ రికార్డును అధిగమిస్తారేమో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications