తెలుగింటి కోడలుగా మృణాల్ ఠాకూర్..? అల్లు అరవింద్ వైరల్ కామెంట్స్..!
'సీతారామం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాల్ ఠాకూర్.. ఈ మూవీలో ఆమె నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా సీత పాత్రలో ఒదిగిపోయి అందరినీ కదిలించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం అడివి శేష్ తో 'డెకాయిట్' మూవీలో నటించింది మృణాల్ ఠాకూర్. ఈ మూవీ ఏప్రిల్ 10 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. థియేటర్లలో హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ మేరకు తాజాగా ఈ మూవీ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు.
ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ తో పాటు ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. వారిలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు. అయితే డెకాయిట్ మూవీ విజయోత్సవ సభలో పాల్గొన్న అల్లు అరవింద్.. మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించి సరదాగా మాట్లాడారు. ఈ మేరకు అందరి ముందు ఒక ఆసక్తికర విషయాన్ని మాట్లాడారు. మృణాల్ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని.. అయితే ఆ వ్యక్తి కచ్చితంగా మన తెలుగువాడే అయి ఉండాలని ఆయన తన కోరికను బయటపెట్టారు.
అయితే అల్లు అరవింద్ స్టేజీపై ఈ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మృణాల్ నవ్వుతూ కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక మృణాల్ ఠాకూర్ నటనపై అల్లు అరవింద్ ప్రశంసల వర్షం కురిపించారు. మృణాల్ చాలా గొప్ప నటి అని.. తన నటనతో అతి తక్కువ కాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందన్నారు. సీతారామం సినిమాతో తనేంటో నిరూపించుకుందని.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అల్లు అరవింద్ గుర్తుచేశారు.

ఇక వేదికమీద అల్లు అరవింద్ మాట్లాడుతూ.. గతంలో తాను ఒక హీరోయిన్ ను ఇలాగే మనస్ఫూర్తిగా దీవించానని.. ఆ తర్వాత ఆమె వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని తమ ఇంటి కోడలైంది (లావణ్య త్రిపాఠి) అని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మృణాల్ ను కూడా అలాగే దీవిస్తున్నానని అన్నారు. మృణాల్ తెలుగు సినిమాలు చేస్తూనే.. ఇక్కడే ఒక మంచి వాడిని చూసుకుని పెళ్లి చేసుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లోనే సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications