చిరంజీవి మాములోడు కాదయ్యో.. మెగా కుటుంబం నుంచి మరో హీరో!
మెగాస్టార్ కుటుంబం నుంచి మరో హీరో రాబోతున్నాడు. ఎవరు? ఎలా? అనేది తెలుసుకుందాం. స్వయంకృషితో చిన్న చిన్న అడుగులు వేస్తూ వస్తోన్న చిరంజీవి.. అల్లురామలింగయ్యకు అల్లుడు కావడంద్వారా ఒక స్థాయికి వచ్చారు. దాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడ్డారు. చివరకు మెగాస్టార్ గా, అగ్ర కథానాయకుడిగా ఆవిర్భవించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత రెండో తరంలోని అగ్రహీరోలు నలుగురున్నారు. వారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. తెలుగు సినీ పరిశ్రమలో రెండు తరాలు పూర్తయిన తర్వాత మూడో తరంలో మహేష్ బాబు, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ తదితరులు వచ్చారు.
క్రికెట్ టీం సభ్యుల్లా
మెగా కుటుంబం నుంచి పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వచ్చారు. అయితే చిరంజీవి అంతటితో సంతృప్తి చెందలేదు. ఏ టీవీలో చూసినా, ఏ థియేటర్ కు వెళ్లాలన్నా, ఏ పాట వినాలన్నా ప్రజలకు వేరే అవకాశాలు లేకుండా తమ కుటుంబ సభ్యులవే ఉండాలనే లక్ష్యంతో ఉండేవారు. అందుకే వరుసగా ఒక్కొక్కరిని హీరోలుగా చేసుకుంటూ వచ్చారు. పవన్ తోపాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, మధ్యలో చిరంజీవి చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ కూడా హీరోగా చేశారు. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు టీం సభ్యులంతా ఒకరి తర్వాత ఒకరు స్టేడియంలోకి అడుగుపెట్టినట్లుగా చిరంజీవి కుటుంబం నుంచి ఒక్కొక్కరుగా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.

అందరికన్నాఎక్కువ భావోద్వేగం చిరంజీవికే
ఇప్పుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులకు కొడుకు పుట్టాడు. అందరికన్నా ఎక్కువ భావోద్వేగానికి గురైంది చిరంజీవే. ఎందుకంటే రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు కుమార్తె జన్మించింది. తర్వాత వారు మళ్లీ పిల్లలను కంటారో? లేదో? తెలియదు. అందుకే వరుణ్ తేజ్ కొడుకునే తన వారసుడిగా చిరంజీవి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే మరో 18 సంవత్సరాలు ఆగితే మెగా కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడన్నమాట. ఇంతమందిని చూడగలిగే ఓపిక తెలుగు ప్రేక్షకులకు ఉందా? లేదా? అనేది వారే నిర్ణయించుకోవాలి.












Click it and Unblock the Notifications