విజయ్ దేవరకొండ రిజెక్ట్ చేసిన 4 బ్లాక్‌బస్టర్లు!
రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు అభిమానుల్లో ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోగా టైర్ 1 హీరోల సరసన ఉండాల్సిన విజయ్ ను దురదృష్టం వెంటాడుతోంది. లైగర్ సినిమా హిట్ అయ్యుంటే టాప్ స్టార్ గా మారిపోయేవాడు. కానీ దురదృష్టం వెక్కిరించింది. అర్జున్ రెడ్డితో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాతో అంతటి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీస్టార్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది.
విజయ్ చుట్టూ తిరిగిన పూరీ
విజయ్ దేవరకొండ చేత సినిమాలు చేయించాలని నలుగురు దర్శకులు పట్టుబట్టి అతనిచుట్టూ తిరిగారు. కానీ ముందూ వెనకా ఊగిసలాడి వాటిని తిరస్కరించాడు. చివరికి ఆ నాలుగు సినిమాలో తెలుగు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ సినిమాలుగా నిలిచాయి. ఆ నాలుగు చేసుంటే విజయ్ దేవరకొండ రేంజ్, క్రేజ్ మరో రీతిలో ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ గా మారేవాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాను చేయాలంటూ పూరీ జగన్నాథ్ విజయ్ చుట్టూ తిరిగాడు. గీత గోవిందం షూటింగ్ కాకినాడలో జరుగుతుంటే అక్కడకు కూడా వెళ్లి కలిశాడు. తెలంగాణ యాస ఈ సినిమాకు ప్రధాన బలం.. నువ్వు చేస్తే సూపర్ హిట్ ఖాయమంటూ చెప్పినప్పటికీ తిరస్కరించాడు. చివరకు ఈ పాత్రలో రామ్ అద్భుతంగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆ హీరోల సరసన నిలిచేవాడు
అలాగే ఉప్పెన సినిమాను విజయ్ తోనే చేయాలని బుచ్చిబాబు ప్రయత్నించినప్పటికీ ఈ సినిమా విషయంలో కూడా రౌడీ హీరో ఊగిసలాడటంతో చివరకు వైష్ణవ్ తేజ్ చేసి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ సినిమాను కూడా విజయ్ తోనే చేయించాలని సందీప్ రెడ్డి ప్రయత్నించినప్పటికీ ఒకే తరహా పాత్ర అని చేయనన్నాడు. షాహిద్ కపూర్ ఈ సినిమాతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అజయ్ భూపతి ఆర్ఎక్స్ 100 సినిమాకు విజయ్ అయితే బాగుంటుందని ఎంతో ప్రయత్నించాడు. కానీ అది కూడా వద్దన్నాడు. సూపర్ హిట్ అయింది. ఈ నాలుగు సినిమాలో విజయ్ దేవరకొండ ఖాతాలో పడుంటే అతని రేంజ్ ఈరోజు మరో స్థాయిలో ఉండేది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సరసన నిలిచేవాడు. వారి సరసన నిలవడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి మరి.












Click it and Unblock the Notifications