నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది గ్యారెంటీ..!
తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వినోదభరితమైన పదమైన 'బద్మాషులు' పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం, మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో శంకర్ చేగూరి దర్శకత్వంలో నేడు విడుదలైంది. ట్రైలర్‌కు లభించిన మంచి స్పందన, ప్రమోషన్లు సినిమాపై అంచనాలను పెంచాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ :
కోతులగూడెం అనే గ్రామంలో నివసించే ట్రైలర్ తిరుపతి (మహేష్ చింతల) మరియు బార్బర్ ముత్యాలు (విద్యాసాగర్ కారంపురి) అనే ఇద్దరు స్నేహితులు ఈ కథలో ప్రధాన పాత్రలు. వీరు పని దొంగలు, నిత్యం తాగుతూ, భార్యాపిల్లలను పట్టించుకోకుండా ఉంటారు. డబ్బుల కోసం తిరుపతి కస్టమర్ల డ్రెస్సులు అమ్మితే, ముత్యాలు ఇంటింటికీ వెళ్లి హెయిర్ కటింగ్ చేస్తూ వచ్చిన డబ్బుతో తాగుతుంటారు. ఒకసారి తాగేందుకు డబ్బుల్లేక స్కూల్లో పెన్షన్ వైర్‌ని దొంగిలించి పోలీసులకు దొరికిపోతారు. స్టేషన్‌లోనూ వారి బుద్ధి మారదు. అక్కడికి వచ్చిన వారి దగ్గర డబ్బులు వసూలు చేసి తాగుతుంటారు. చిన్న దొంగతనమే కదా అని నాలుగు రోజుల తర్వాత వారిని వదిలేస్తారు. అదే సమయంలో స్కూల్లో ఒక కంప్యూటర్ మిస్ అవుతుంది. అందులో పూర్వ విద్యార్థుల డేటా ఉంటుంది. ఈ కేసు వీరిద్దరిపైకి వస్తుంది. ఆ కంప్యూటర్ దొంగిలించింది ఎవరు? అది ఎక్కడ ఉంది? దొంగను పట్టుకునేందుకు కానిస్టేబుల్ రామచందర్ (మురళీధర్ గౌడ్)కు తిరుపతి, ముత్యాలు ఎలా సహాయం చేశారు? అసలు తిరుపతి, ముత్యాలు తాగుబోతులుగా మారడానికి కారణం ఏంటి? చివరకు వీరిద్దరిలో మార్పు వచ్చిందా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ:
ఇది తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక కామెడీ ఎంటర్‌టైనర్. పల్లెటూరికి చెందిన ఇద్దరు తాగుబోతుల చుట్టూ కథనం సాగుతుంది. తిరుపతి, ముత్యాలుతో పాటు ఈ చిత్రంలోని ప్రతి పాత్ర నిజజీవితంలో మన ఊరిలో కనిపించే వారిలాగే ఉంటూ నవ్విస్తాయి. సినిమా చివరిలో ఒక మంచి సందేశం కూడా ఇచ్చారు. అయితే, దర్శకుడు కథ కంటే కామెడీ సన్నివేశాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. కొన్ని చోట్ల 'జాతి రత్నాలు' ఛాయలు కనిపిస్తాయి. ఒకే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుండడంతో, నిడివి తక్కువైనా కొంత సాగదీతగా అనిపించవచ్చు. కొన్ని చోట్ల కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదనిపిస్తుంది.
డ్రెస్ కుట్టమని వస్త్రం ఇస్తే దానిని అమ్ముకొని తాగే ట్రైలర్, సగం సగం షేవింగ్ చేస్తూ మధ్యలోనే బార్ కెళ్లే బార్బర్ పాత్రల పరిచయ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అయితే, అలాంటి పాత్రలతో మరింత కామెడీ పండించే అవకాశం ఉన్నా, దర్శకుడు రొటీన్ సన్నివేశాలనే రాసుకున్నాడు. అవి కొంతవరకు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. దొంగతనం చేసి పోలీస్ స్టేషన్ వెళ్లేవరకు కథనం సోసోగానే సాగుతుంది. స్టేషన్‌లో వీరిద్దరు చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ సీన్ రొటీన్‌గా ఉంటుంది. సెకండాఫ్ కూడా మళ్ళీ దొంగతనం చుట్టే తిరగడంతో బోర్ అనిపించవచ్చు. దొంగను పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు అంతగా ఆకట్టుకోలేవు. క్లైమాక్స్‌లో ఇచ్చిన సందేశం ఆలోచింపజేస్తుంది. ఎలాంటి వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా, ఫ్యామిలీ అంతా చూసేలా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. అయితే, కథను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది.
నటీనటుల ప్రదర్శన:
బలగం, భీమదేవరపల్లి, రామన్న యూత్ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన విద్యా సాగర్ ఈ చిత్రంతో హీరోగా మారి, తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. బార్బర్ ముత్యాలు పాత్రలో ఒదిగిపోయి, కొన్ని చోట్ల ఎక్స్‌ప్రెషన్స్‌తోనే నవ్వులు పూయించాడు. నటుడిగా అతనికి మంచి భవిష్యత్తు ఉంది. ట్రైలర్ తిరుపతిగా మహేష్ చింతల కూడా సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అతని సింపుల్ పంచులు బాగా పేలాయి. విద్యా సాగర్, మహేష్ ఇద్దరూ తెరపై నిజమైన తాగుబోతుల్లాగే కనిపించారు. ముత్యాలు భార్యగా దీక్ష కోటేశ్వర్, తిరుపతి భార్యగా కవిత పాత్రల పరిధి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించారు. మురళీధర్, బలగం సుధాకర్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు:
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. తేజ కూనూరు నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ, గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
మొత్తంగా, 'బద్మాషులు' ఒక నవ్వులు పంచే ప్రయత్నం. తెలంగాణ గ్రామీణ నేపథ్యాన్ని, అక్కడ హాస్యాన్ని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చవచ్చు.
Rating:2.5/5












Click it and Unblock the Notifications