బుక్ అయిన హీరోయిన్ ఫారియా
Bangladesh: బంగ్లాదేశ్ కు చెందిన ప్రముఖ నటి నుస్రత్ ఫారియా అరెస్ట్ అయ్యారు. ఢాకా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం థాయ్ లాండ్ వెళ్తోండగా ఢాకా షాజలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేశారు. హత్యాయత్నంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నుస్రత్ ఫారియా.. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, షేక్ ముజీబుర్ రెహ్మాన్, షేక్ హసీనా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ముజీబ్: ది మేకింగ్ ఆఫ్ ఎ నేషన్లో నటించారు. షేక్ హసీనా పాత్రను పోషించారు. భారత్ కు చెందిన ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు గ్రహీత శ్యామ్ బెనెగల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

జూలై 2024లో అప్పటి షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనల ప్రదర్శనలు, ఆందోళనల సందర్భంగా నుస్రత్ ఫారియా.. ఆందోళనకారుల హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఆమె ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించారు. ఈ ఉదయమే ఆమెకు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు. లుక్ అవుట్ నోటీసు ఇచ్చారు.
ఓ మూవీ షూటింగ్ కోసం థాయ్ లాండ్ కు బయలుదేరి వెళ్లడానికి ఢాకా ఎయిర్ పోర్ట్ కు చేరుకోగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్ట్ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్లు నమోదు చేశారు. అరెస్ట్ విషయాన్ని బడ్డా జోన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ షఫీకుల్ ఇస్లాం ధృవీకరించారు.
2024 నాటి అల్లర్ల సందర్భంగా హత్యకు కుట్ర పన్నినట్లు నుస్రత్ ఫారియాకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను సేకరించినట్లు తెలిపారు. అరెస్టు తర్వాత ఢాకాలోని వటారా పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ కేసును ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్ కార్యాలయానికి బదిలీ చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications