22 ఏళ్ల నటి దారుణ హత్య: 500 మంది నేరం అంగీకరించినా దొరకని అసలు హంతకుడు!
Black Dahlia Murder: అమెరికా చరిత్రలో అత్యంత క్రూరమైన, మిస్టరీగా మిగిలిన హత్య కేసుల్లో ఒకటి 1947లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన నటి ఎలిజబెత్ షార్ట్ హత్య కేసు సంచలనంగా మిగిలింది. ఈ కేసును 'బ్లాక్ డహ్లియా మర్డర్'గా ప్రపంచం మొత్తం గుర్తించింది. 75 ఏళ్లు దాటినా, నేటికీ ఈ హత్యా రహస్యాన్ని ఛేదించలేకపోయారు.
లాస్ ఏంజిల్స్: అమెరికా చరిత్రలో అత్యంత క్రూరమైన, మిస్టరీగా మిగిలిన హత్య కేసుల్లో ఒకటి 1947లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన నటి ఎలిజబెత్ షార్ట్ హత్య కేసు. ఈ కేసును 'బ్లాక్ డహ్లియా మర్డర్'గా (Black Dahlia Murder) ప్రపంచం మొత్తం గుర్తించింది. 75 ఏళ్లు దాటినా, నేటికీ ఈ హత్యా రహస్యాన్ని ఛేదించలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా అనేక హత్యలు, దోపిడీల కేసులు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి వాటిలో అమెరికాకు చెందిన 'బ్లాక్ డహ్లియా మర్డర్' కేసు ఒకటి. 1947లో జరిగిన ఈ హత్య అప్పట్లో యావత్ అమెరికాలో కలకలం సృష్టించింది.

శరీరాన్ని రెండు ముక్కలు చేసి..
బోస్టన్‌కు చెందిన 22 ఏళ్ల నటి ఎలిజబెత్ షార్ట్, 'బ్లాక్ డహ్లియా'గా ప్రసిద్ధి చెందింది. 1947, జనవరి 9న ఎలిజబెత్ షార్ట్ అకస్మాత్తుగా అదృశ్యమైంది. జనవరి 15, 1947న ఓ మహిళ తన బిడ్డతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డు పక్కన నడుము భాగం నుంచి రెండు ముక్కలుగా నరికిన మృతదేహాన్ని చూసింది. మొదట అదో బొమ్మ అనుకున్నా, దగ్గరకెళ్లి చూశాక దిగ్భ్రాంతికి గురైంది. హంతకుడు కేవలం శరీరాన్ని రెండు ముక్కలు చేయడమే కాక, మృతదేహం నోటిని, చెవుల వరకు చీల్చేశాడు. ఆ మృతదేహం చాలా భయంకరంగా ఉంది. మృతదేహం లభించిన ప్రాంతంలో ఎక్కడా రక్తపు మరకలు లేకపోవడం పోలీసులను గందరగోళానికి గురి చేసింది. అంటే హత్యను మరొక చోట చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని ఇక్కడ పడేశారని స్పష్టమైంది.
హంతకుడు డాక్టరా? కసాయా?
ఎలిజబెత్ షార్ట్ మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు షాక్ అయ్యారు. శరీరాన్ని నడుము దగ్గర నుంచి సరిగ్గా రెండు ముక్కలుగా కోశారు. అక్కడ ఒక్క చుక్క రక్తం కూడా లేదు.మృతదేహం నుంచి కొన్ని అంతర్గత అవయవాలను కూడా తొలగించారు. ఈ హత్య తీరు చూస్తుంటే చంపిన వ్యక్తి కసాయిలా కాక, శవాలను కోసే వృత్తిపరమైన వ్యక్తి లేదా డాక్టర్ అయ్యి ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో సమీపంలోని మెడికల్ కాలేజీ విద్యార్థులను కూడా విచారించారు, కానీ ఫలితం దక్కలేదు.
జనవరి 16న జరిగిన శవపరీక్ష నివేదిక ప్రకారం, ఎలిజబెత్‌ను చంపడానికి ముందు హింసించారు. ఆమె తల, మణికట్టు, చీలమండ, మెడపై గాయాలు ఉన్నాయి. కుడి రొమ్ము భాగాన్ని కోశారు. ఆమె మరణానికి ముందు శరీరం నుంచి రక్తాన్ని మొత్తం తీసివేశారు. లైంగిక దాడి జరిగిందని వైద్యులు అనుమానించినా, దానికి సంబంధించిన ఆనవాళ్లు మాత్రం దొరకలేదు.
వ్యక్తిగత జీవితంపై విచారణ
22 ఏళ్ల ఎలిజబెత్ షార్ట్ తండ్రి తన ఆస్తిని మొత్తం షేర్ మార్కెట్‌లో పోగొట్టుకోవడంతో, ఆమె చిన్న వయసులోనే స్వశక్తితో డబ్బు సంపాదించాలని క్లర్క్‌గా పనిచేసింది. ఆ తర్వాత హాలీవుడ్‌లో నటిగా స్థిరపడాలని లాస్ ఏంజిల్స్‌కు వచ్చింది. విచారణలో భాగంగా ఎలిజబెత్ షార్ట్‌పై వేశ్యావృత్తి ఆరోపణలు వచ్చాయి. ఆమె తరచుగా వివిధ వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునేదని డిటెక్టివ్‌లు కనుగొన్నారు. అంతేకాక, ఆమెకు కొంతమంది మహిళలతో కూడా సంబంధాలు ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
మిస్టరీ మరింత జటిలం
సాధారణంగా హత్య కేసుల్లో సాక్ష్యం చెప్పడానికి, నేరం అంగీకరించడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ఈ బ్లాక్ డహ్లియా కేసులో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రాథమిక విచారణలోనే దాదాపు 60 మంది ఈ నేరం తామే చేశామని అంగీకరించారు. దశాబ్దాలుగా సాగిన విచారణలో 500 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించారు నేరం అంగీకరించిన వారిలో కొంతమంది హత్య జరిగిన సమయంలో జన్మించని వారు కూడా ఉండటం విచిత్రం. దీంతో పోలీసులు, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు కొందరిపై కేసులు కూడా నమోదు చేయాల్సి వచ్చింది. ఈ కేసులో అసలు హంతకుడిని నేటికీ పట్టుకోలేకపోవడంతో, ఎలిజబెత్ షార్ట్ హత్య కేసు అమెరికా చరిత్రలోనే అత్యంత క్రూరమైన, అంతుచిక్కని మర్డర్ మిస్టరీగా మిగిలిపోయింది. ఈ కేసు గురించి ఇప్పటికే అనేక పుస్తకాలు, సినిమాలు కూడా వచ్చాయి.












Click it and Unblock the Notifications