మెగా హీరోలకు శాపంలా మారిన ఆ 'పేరు'!
మెగా హీరోలంటే నిర్మాతలతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకులు కూడా భయపడిపోతున్నారు. ఏ హీరో నుంచి సినిమా వచ్చినా కచ్చితంగా ఫ్లాప్ అవడం మాత్రం ఖాయం అనే లెక్క వేసుకుంటున్నారు. రోజురోజుకు మెగా హీరోల నుంచి సినిమాలు వస్తున్నాయంటే వాటి కొనుగోలుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడంలేదు. తాజా మెగా హీరో వరుణ్ తేజ్ నుంచి వచ్చిన మట్కా చిత్రం డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనివల్ల కొనుగోలుదారులంతా నిండి మునిగిపోయారు.
కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాల నుంచి అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. రాజకీయాల్లోకి వెళ్లి అందులో ఇమడలేక మళ్లీ తిరిగివచ్చేశారు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో హిట్ అయినవి కేవలం రెండే. ఖైదీనెంబర్ 150 కాగా, మరొకటి వాల్తేరు వీరయ్య. సైరా నరసింహారెడ్డికి భారీ బడ్జెట్ అవడంతో కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. గాడ్ ఫాదర్, భోళాశంకర్.. అన్నీ ఫ్లాప్ సినిమాలే. బయ్యర్లంతా భారీగా నష్టపోయారు. పవన్ కల్యాణ్ పారితోషికం ఎక్కువ కావడంతో అతని సినిమాలన్నీ కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలుస్తున్నాయి. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ నుంచి వచ్చిన గత చిత్రాలు గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ అన్నీ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగిల్చాయి.

ఇండియాలోనే డిజాస్టర్ మూవీగా నిలిచింది
చిరంజీవి కొడుకు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టినా దానికి ముందు చేసిన వినయవిధేయ రామ, దాని తర్వాత చేసిన ఆచార్య అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ మీద ఎవరికీ ఆశల్లేవు. ఎందుకంటే ఈ సినిమాకు ముందు శంకర్ చేసిన ఇండియన్ 2 భారతదేశంలో అత్యంత డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. చిరంజీవి మేనల్లు సాయిధరమ్ తేజ్ చేసిన విరూపాక్ష ఒకటే హిట్ అయింది. రిపబ్లిక్, బ్రో సినిమాలు ఫ్లాపయ్యాయి. బ్రో సినిమాలో పవన్ కల్యాణ్ నటించినా సినిమాను మాత్రం ప్రేక్షకులు ఆదరించలేదు.

మెగా ట్యాగ్ శాపంలా మారింది
సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా మినహా అతని కెరీర్ లో మరో సినిమా ఏదీ హిట్ అవలేదు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ ప్రస్తుతం మెగా కుటుంబంతో సంబంధం లేకుండా తమను తాము నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో మెగా హీరో ట్యాగ్ నుంచి వీరిద్దరూ బయటకు వచ్చేసినట్లే. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో హిట్ కొట్టడం మెగా కుటుంబానికి అత్యవసరంగా మారింది. లేదంటే నిర్మాతలెవరూ వీరితో సినిమా చేయడానికి ముందుకురాని పరిస్థితి నెలకొంటుంది. మెగా అనే ట్యాగ్ ప్రస్తుతం వీరికి శాపంలా మారిందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications