ఏపీ పంచాయతీరాజ్ దేశంలోనే నెంబర్ 1.. పవన్ కళ్యాణ్ పాలనపై చిరంజీవి ప్రశంసలు

తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ గొప్పతనం, మంచి మనసుపై వీలున్నప్పుడల్లా ప్రశంసిస్తుంటారు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా పవన్‌పై తన ప్రేమను చాటుకున్నారు చిరు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు- పవన్‌ల పాలనలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సుపరిపాలనపై చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ వివరాల్లోకి వెళితే..

తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురంలో ఆదివారం చిరంజీవి పర్యటించారు. ఈ సందర్భంగా జీఎస్ఎల్ ఆసుపత్రి, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్మించిన హెల్త్ కేర్ సెంటర్‌ను చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మెగాస్టార్ ప్రసంగించారు. కపిలేశ్వరపురం అంటే చాలా చిన్నది అలా వెళ్లి ఇలా వచ్చేద్దామని అనుకున్నాను. మురళీ మోహన్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించారు, ఎన్నో ఏళ్లుగా తెరపై మిమ్మల్ని అలరించారు. మురళీ మోహన్‌గారు చాలా విషయాల్లో స్పూర్తి. అంత వయసులో కూడా ఏజ్ కనపడనివ్వకుండా రివర్స్ గేర్‌లో కనిపిస్తున్నారు. ఇలాంటి వారిని చూసినప్పుడు నేను కూడా ఆరోగ్య సూత్రాలు పాటించాలి.. వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే మానసికంగా ఎంత దృఢంగా ఉండాలి అని నేర్చుకుంటాను అని చిరంజీవి తెలిపారు.

Chiranjeevi Praises Pawan Kalyan s Governance Appreciates Andhra Pradesh s Development

నా అభిమానులుగా ఉన్నవారు అత్యున్నత స్థానాలకు ఎదిగారు. సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా మంచి పనులు చేస్తున్నారు. కామినేని శ్రీనివాసరావు గారు మాకు పెద్దన్నయ్య లాంటి వారు. నేను వస్తున్నానని నా కోసం వచ్చారు. ఆహార నియమాలు, ఎక్సర్‌సైజ్‌లు కాదు.. మీలాంటి వారి అభిమానంతోనే యంగ్ అండ్ ఎనర్జీగా కనిపిస్తున్నాను. ఇంకా సినిమాల్లో కనిపించడానికి ప్రధానమైన కారణం అదే. క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన కల్పించడానికి నిర్వాహకులు చేస్తున్న పనికి సాయపడాలని బాధ్యతగా నేను కూడా ఇక్కడికి వచ్చాను. క్యాన్సర్ రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.. లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను కలిస్తే క్యాన్సర్‌కు భయపడాల్సిన పరిస్థితి ఉండదని చిరంజీవి తెలిపారు.

మా అమ్మ, నా భార్య, నా చెల్లెల్లు అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయిస్తుంటాను. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారి సలహా మేరకు నేను కూడా ఎండోస్కోప్, కొలనో స్కోప్ చేసుకున్నాను. నేను చేసుకోవడమే కాకుండా నా మిత్రులు, కుటుంబ సభ్యులు ఎంతో మందిని ఆయన దగ్గరికి పంపించాను. డాక్టర్లు, నిపుణులు ఇంత మంది ఉన్నారు.. నా సినిమాల గురించి కాకుండా ఈ మెడికల్ గురించి మాట్లాడటం నాకు కష్టంగానే ఉంది. కానీ నేను ఫాలో అవుతున్నాను, నా ఇంట్లో అందరి చేతా చేయిస్తున్నాను కాబట్టే నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. చెడు వ్యసనాలు ఉంటే ఖచ్చితంగా మానేయండి.. వ్యాధుల బారినపడి కుటుంబాలను నాశనం చేయొద్దని చిరంజీవి పిలుపునిచ్చారు.

నా లాంటి వాడు ఒక మాట చెబితే వింటారని కామినేని శ్రీనివాస్ గారు అన్నారు.. నా మాట విని బ్లడ్ డొనేషన్‌ చేస్తూ ఎంతోమంది ప్రాణాలు కాపాడగలిగాను. ప్లాస్టిక్ అనేది మానవాళికి సంబంధించిన పెను ముప్పు. ప్లాస్టిక్ బాటిల్ తాగేస్తున్నాం, పక్కనపడేస్తున్నాం.. దీని వల్ల ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. నేను చెప్పడం కాదు ఆచరిస్తున్నాను.. ప్లాస్టిక్ బాటిల్ బదులు గ్లాస్ బాటిల్‌ను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాను. ప్లాస్టిక్ బాటిల్‌లోని కొన్ని కెమికల్స్ నేరుగా బ్లడ్‌లోకి వెళ్లిపోయి గుండెపోటులు వచ్చే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్‌ను దూరం పెట్టండి.. అది మానవాళికే ప్రమాదమని చిరంజీవి హెచ్చరించారు.

ఇక్కడ పరిపాలన ఎలా ఉంది? ఇక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి? అని అడుగుతున్నారు. నేను ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. గతానికి ఇప్పటికీ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. మంచి రోడ్లు వచ్చాయి, ఎక్కడో 25, 23 స్థానాలలో ఉండే ఏపీ పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్.. దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. నెమ్మదిగా అన్ని బాగుపడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగి మన రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని, వారికి న్యాయం జరగాలి, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని చిరంజీవి పరోక్షంగా తన సోదరుడు పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+