జూనియర్ ఎన్టీఆర్ - అల్లు అర్జున్ మధ్య విభేదాలు?
తెలుగు సినీ పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇద్దరూ ఒకర్నొకరు బావా.. బావా అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు. తాము చేయబోయే సినిమాలు, తమదగ్గరకు దర్శకులు తీసుకువచ్చిన కథలపై కూడా ఇద్దరూ చర్చించుకుంటారు. ఇద్దరిలో ఎవరికైనా కథ నచ్చితే, అది తామిద్దరిలో ఎవరికి బాగుంటుందో ముందుగానే నిర్ణయించుకొని కథలను కూడా మార్చుకుంటూ సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. అలాగే తెలుగులో ఓ దర్శకుడు ముందుగా జూనియర్ ఎన్టీఆర్ కు ఒక సినిమా కథ వినిపించారు.
తారక్ కు బాగా నచ్చింది. తర్వాత ఆ దర్శకుడు అదే కథను అల్లు అర్జున్ కు కూడా వినిపించారు. బన్నీకి కూడా బాగా నచ్చింది. తర్వాత మీ ఇద్దరిలో ఎవరు చేస్తారో మీరే నిర్ణయించుకోండని ఇద్దరు హీరోలకు తేల్చి చెప్పాడు. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండటంతో ఒకరి కోసం మరొకరు కథను త్యాగం చేయాలనుకున్నారు. నువ్వు చెయ్యి బావా.. అంటే నువ్వు చెయ్యి బావా.. అంటూ ఒకరిపై ఒకరు ఒత్తిడి చేసుకున్నారు. ఇంత గొడవ జరుగుతుండగా చివరకు తారక్ ఆ సినిమాను నువ్వే చెయ్యి బావా అంటూ బన్నీని బలవంతంగా ఒప్పించాడు. ఆ సినిమా మరేదో కాదు.. అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పిన బన్నీ. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అల్లు అర్జున్ కు ఒక మాస్ ఇమేజ్ ను కట్టబెట్టింది.

ఈ విషయంలోనే తారక్-బన్నీ.. కొద్దిరోజులు మాట్లాడుకోలేదని, ఒకరితో మరొకరు ఆ సినిమా చేయించాలనే పట్టుదలతో ఉండి అలా వ్యవహరించారని, చివరకు తారక్ మాట నెగ్గిందంటూ ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం గ్లోబల్ హీరోగా మారిన తారక్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే పట్టుదలతో కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నాడు. అలాగే బన్నీ పుష్ప2 చేస్తున్నారు. ఇది ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కాబోతోంది.












Click it and Unblock the Notifications