'హనీ' రివ్యూ: దెయ్యాల కంటే మనుషులే భయంకరం!
మనిషి నమ్మకం మందు లాంటిది... అది మోతాదు మించితే విషంగా మారుతుంది. ఆ విషం 'మూఢనమ్మకం' అనే రూపం దాలిస్తే, కన్న కూతురిని కూడా బలిపీఠం ఎక్కించేంత క్రూరంగా మారుతుందని కళ్ళకు కట్టినట్లు చూపించిన చిత్రం 'హనీ'. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుందా? లేక వణికిస్తుందా? చూద్దాం.
కథ
ఆనంద్ (నవీన్ చంద్ర) ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి. కానీ, అతని మెదడు నిండా క్షుద్ర పూజలు, అఘోర నమ్మకాలే. తన కష్టాలన్నింటికీ పరిష్కారం ఆ చీకటి విద్యల్లోనే ఉందని నమ్ముతాడు. ఆ పిచ్చితోనే ఉద్యోగం పోగొట్టుకుని, తన భార్య లలిత (దివ్య పిళ్లై), కూతురు మీరాలను తీసుకుని ఊరికి దూరంగా ఉన్న ఒక పాడుబడ్డ ఇంటికి వెళ్తాడు. తన పూజలు ఫలించాలంటే కూతురు మీరా సహకరించాలని వేధిస్తుంటాడు. అన్యోన్యంగా ఉండాల్సిన కుటుంబం, ఆ తండ్రి ఉన్మాదంలో ఎలా ఛిన్నాభిన్నమైంది? ఆ ఇంట్లో జరిగిన భయంకరమైన వాస్తవాలేమిటి? అనేది మిగతా కథ.

విశ్లేషణ:
మదనపల్లెలో జరిగిన యదార్థ ఘటనల ఛాయలు ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయి. దర్శకుడు కరుణ కుమార్ ఎక్కడా అనవసరమైన జంప్-స్కేర్స్ జోలికి వెళ్ళలేదు.కథలో బిల్డ్ చేసిన టెన్షన్. తర్వాతి సీన్ లో ఏం జరుగుతుంది? అన్న ఆందోళన ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడుతుంది.సెకండ్ హాఫ్ లో కథనం కొంచెం నెమ్మదించినట్లు అనిపించినా, క్లైమాక్స్ ఇచ్చే ఎమోషనల్ షాక్ ఆ లోటును భర్తీ చేస్తుంది. ఇది కేవలం భయపెట్టే సినిమా కాదు, సమాజంలోని చీకటి కోణాన్ని చూపే ఒక సామాజిక అద్దం.
నటీనటుల ప్రతిభ
ఆనంద్ పాత్రలో నవీన్ చంద్ర నటన అద్భుతం. ఒక పక్క తండ్రిగా ప్రేమ, మరోపక్క మూఢనమ్మకాలతో నిండిన ఉన్మాదిగా ఆయన కళ్ళలో కనిపించే తీక్షణత వెన్నులో వణుకు పుట్టిస్తుంది. నిస్సహాయురాలైన తల్లిగా, భర్త పిచ్చిని భరిస్తూ కూతురిని కాపాడుకోవాలని తపించే లలిత పాత్రలో ఆమె ఒదిగిపోయింది.దివి & రాజా రవీంద్ర తమ పరిధి మేర కథకు అవసరమైన డార్క్ షేడ్స్‌ని అద్దారు.
సాంకేతిక విభాగం
అజయ్ అరసాడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి వెన్నెముక. కొన్ని సీన్లలో మ్యూజిక్ కంటే నిశ్శబ్దమే ఎక్కువ భయాన్ని కలిగిస్తుంది. డార్క్ టోన్ సినిమాటోగ్రఫీ సినిమా మూడ్‌ని పర్ఫెక్ట్‌గా ఎలివేట్ చేసింది.
బలం:
నవీన్ చంద్ర నటన
కరుణ కుమార్ మేకింగ్ స్టైల్
గుండెను కుదిపేసే క్లైమాక్స్
బలహీనత:
స్లోగా సాగే సెకండ్ హాఫ్
బలహీన మనస్కులకు కొంచెం కష్టమే
బాటమ్ లైన్:
'హనీ' ఇది అందమైన పేరున్న ఒక చేదు నిజం. క్షుద్ర పూజలు, మూఢనమ్మకాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న అమాయకుల ఆక్రందన ఈ సినిమా. హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికే కాకుండా, సమాజం ఎటు పోతుందో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.
రేటింగ్: 3/5












Click it and Unblock the Notifications