బాలయ్య ఎదురుగా.. పిఠాపురంలో పవన్ గెలుపుపై తేల్చేసిన హైపర్ ఆది
Nandamuri Balakrishna: ప్రముఖ నటుడు విష్వక్ సేన్, అంజలి, నేహా షెట్టి నటించిన మూవీ- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. కృష్ణ చైతన్య దర్శకుడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మూవీ ఇది. ఈ నెల 31వ తేదీన విడుదల కాబోతోంది. నాజర్, సాయికుమార్, హైపర్ ఆది, మధునందన్, ప్రవీణ్.. ఇతర కీలక పాత్రలను పోషించారు.
సితార ఎంటర్టైన్‌మెంట్, ఫార్చున్ ఫోర్ బ్యానర్ కింద సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, వెంకట్ ఉప్పుటూరి దీన్ని నిర్మించారు. లంకల రత్నాకర్ అలియాస్ రత్నగా మాస్ క్యారెక్టర్‌లో కనిపించాడు విష్వక్ సేన్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్ పడ్డాయతనికి.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నడుస్తోంది. హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటైంది. ప్రముఖ నటుడు, నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసిన తరువాత ఆయన హాజరైన తొలి సినిమా ఈవెంట్ ఇదే.
ఈ ఎన్నికల్లో బాలకృష్ణ.. శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయడం వరుసగా ఇది మూడోసారి. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి ఘన విజయం సాధించారు టీడీపీ అభ్యర్థిగా. హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయ్యారు. ఇదెంత వరకు వాస్తవ రూపం దాల్చుతుందనేది జూన్ 4 తేలిపోతుంది.
ఈ ప్రోగ్రామ్‌లో కమేడియన్, జనసేన పార్టీ నాయకుడు హైపర్ ఆది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి నటసింహం, కొణిదెల కొదమసింహం అసెంబ్లీలో అడుగు పెట్టబోతోన్నాయని అన్నారు. నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసి అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో, మాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో.. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చూసినా అంతే కిక్ వస్తుందని అన్నారు.
ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనపై సిట్టింగ్ ఎంపీ వంగా గీతను నిలిపింది వైఎస్ఆర్సీపీ.
జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించారు హైపర్ ఆది. పవన్ కల్యాణ్ నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రచారానికి తెర పడేంత వరకూ ఆయన పిఠాపురంలోనే ఉన్నారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల్లో పర్యటించారు. పవన్ కల్యాణ్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు.












Click it and Unblock the Notifications