నేను ఒరిజినల్... మిగతావారు డూప్లికేట్: బాలయ్య
బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ2 చిత్రం డిసెంబరు 5వ తేదీన విడుదల కాబోతోంది. సనాతన హైందవ ధర్మం ప్రాముఖ్యతను చెబుతూ ఈ సినిమాను నిర్మించారు. తొలిసారిగా బాలయ్య నుంచి పాన్ ఇండియా సినిమా రాబోతోంది. దీనికి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు సినిమా యూనిట్ అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. తాజాగా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బాలయ్య సుదీర్ఘ నట ప్రస్థానానికి గుర్తుగా ఘనంగా సన్మానం నిర్వహించారు.
ఘనంగా సన్మానించిన అశోక్ గజపతిరాజు
గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి ఎల్.మురుగన్ సంయుక్తంగా బాలయ్యకు శాలువా కప్పి సత్కరించారు. భారతీయ సినీ పరిశ్రమకు బాలకృష్ణ చేసిన కృషిని కొనియాడటంతోపాటు ఆయన ప్రభావాన్ని వివరించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడిన బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరలవుతున్నాయి. ప్రధానంగా తెలుగు సినీ పరిశ్రమలో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

అవసరమైతేనే టెక్నాలజీ వాడాలి
సినిమాకు అవసరమైనప్పుడు మాత్రమే సాంకేతికతను ఉపయోగించాలి. కానీ పూర్తిగా సాంకేతికతమీదే ఆధారపడినవారిని నేను హీరోలుగా పరిగణించను. చాలామంది హీరోలు గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఉపయోగించి పని కానిచ్చేస్తున్నారు. కొంతమందైతే అసలు సెట్స్ కు కూడా రావడంలేదు. ప్రస్తుతం సినిమా నిర్మాణంలో సాంకేతికత పెరిగింది.. అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. నేను 50 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను.. నాకు సినిమాపై పరిజ్ఞానం ఉంది.. వారసత్వమే నన్ను నిలబెట్టింది.. అదే నాకు గర్వకారణం.. గ్రీన్ మ్యాట్, బ్లూమ్యాట్ వాడేవారంతా డూప్లికేట్ హీరోలు.. అందుకే నేను ఒరిజినల్.. వారంతా డూప్లికేట్ అని బాలయ్య వ్యాఖ్యానించారు.
ఆ హీరోలు ఎవరో అందరికీ తెలుసు
చాలామంది యువ హీరోలు ఇప్పుడు గ్రీన్ మ్యాట్ పై పని కానిచ్చేస్తున్నారు. అంతేకాదు.. పెద్దగా కష్టపడటంలేదు. షూటింగ్స్ కు కూడా హాజరుకావడంలేదు. సెట్స్ కు అసలే రారు. ఇవన్నీ ఏ హీరోల గురించి అనేది ఆయా హీరోలకు అర్థమయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య తీవ్రమైన చర్చ నడుస్తోంది. కొందర వీటికి మద్దతిస్తుంటే, మరికొందరు మాత్రం తమ హీరోలనే అన్నారంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బాలయ్య వ్యాఖ్యలు పెద్ద సంచలనానికి దారితీశాయి.












Click it and Unblock the Notifications