Bharateeyudu 2: తెలంగాణలో టికెట్ రేట్లు పెంపు: ఎక్స్‌ట్రా షోస్: అక్కడే ట్విస్ట్.. కొత్త షరతు
Kamal Haasan Indian 2: మచ్ అవైటెడ్ మూవీ.. భారతీయుడు 2. కమల్ హాసన్ హీరో. ఎస్ శంకర్ దర్శకుడు. 1996లో విడుదలై బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించిన సూపర్ హిట్ మూవీ భారతీయుడుకు సీక్వెల్‌గా తెరకెక్కింది. 250 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చిత్రీకరణ జరుపుకొన్న ఈ పాన్ ఇండియా మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి.
విక్రమ్ సూపర్ హిట్ తరువాత కమల్ హాసన్ నటించిన సినిమా ఇదే. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ల కింద సుబాస్కరన్ అలీరజా, ఉదయనిధి స్టాలిన్ సంయుక్తంగా నిర్మించారు. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జే సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, బ్రహ్మానందం, గుల్షన్ గ్రోవర్, సముద్రఖని.. ఇతర కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతాన్ని సమకూర్చారు.

ఈ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే- వారం రోజుల పాటు అదనపు షోలను కూడా ప్రదర్శించడానికి అంగీకారాన్ని తెలిపింది. దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ జితేందర్ కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు ఇచ్చారు. డీజీపీగా బాధ్యతలను స్వీకరించడానికి ముందు ఆయన సంతకం చేసిన చివరి ఫైల్ ఇదే కావొచ్చు.
12 నుంచి 19వ తేదీ వరకు రోజూ అయిదు ఆటలను ప్రదర్శించడానికి భారతీయుడు 2 సినిమా యూనిట్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ల రేట్లను పెంచుకోవడానికి అంగీకరించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. మల్టీప్లెక్స్‌లల్లో 75 రూపాయలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లల్లో 50 రూపాయలను పెంచుకోవచ్చు.
సినిమా మొదలు కావడానికి ముందు డ్రగ్స్, గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ సినిమాలో నటించిన నటీనటులతో చిత్రీకరించిన ఓ వీడియోను థియేటర్‌లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ కండీషన్ మీద టికెట్ల రేట్లను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications